Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.. వీడియో
Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాడు టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి. గురువారం (మే 9) రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు.
Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నాడు. గురువారం (మే 9) రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా అతని వెంటే వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన ఎంతో సంతోషంగా కనిపించారు.
చిరంజీవికి పద్మ విభూషణ్
నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ అభిమానులను అలరిస్తూ మెగాస్టార్ బిరుదు అందుకున్న కొణెదల చిరంజీవికి ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును చిరు గురువారం (మే 9) రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవడం కోసం బుధవారమే (మే 8) చిరంజీవి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు.
చిరంజీవితోపాటు అతని భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లడం విశేషం. చిరంజీవి అవార్డు అందుకుంటుండగా.. ప్రేక్షకుల్లో ఉన్న చరణ్, ఉపాసన కూడా ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. చిరంజీవి కాకుండా వైజయంతిమాల, మిథున్ చక్రవర్తి, విజయ్‌కాంత్, ఉషా ఉతుప్ లకు ఈసారి పద్మ అవార్డులను ప్రకటించారు.
పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గతంలో మాట్లాడాడు. "ఈ అవార్డు ప్రకటించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ప్రేక్షకులు నాపై చూపించిన బేషరతు ప్రేమకు నిదర్శనం. మీ అందరికీ రుణపడి ఉంటాను. నాకు తోచిన రీతిలో కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించాను. అది ఎంత చెప్పినా తక్కువే" అని చిరు అన్నాడు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవితోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చిరంజీవి సినీ, వ్యక్తిగత జీవితం
నాలుగున్నర దశాబ్దాలుగా చిరంజీవి 150కిపైగా సినిమాల్లో నటించాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ కొన్ని మూవీస్ చేశాడు. 2006లోనే పద్మ భూషణ్ అవార్డు అందుకున్న చిరు.. ఆ తర్వాత కొన్నాళ్లకే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఉమ్మడి ఏపీలో పోటీ చేశాడు. 18 సీట్లు కూడా గెలుచుకున్నాడు.
అయితే ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. 2017లో తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యలాంటి హిట్ మూవీస్ లో నటించాడు.
ఇక సినిమాలు కాకుండా బయట చిరంజీవి చేసిన దాతృత్వ కార్యక్రమాలతోనూ పేరు సంపాదించాడు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐ, బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశాడు. కొవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంక్స్, అంబులెన్సులను ఏర్పాటు చేశాడు. ఇక ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నాడు.