Tillu Square OTT Release Date: టిల్లూ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్.. అనుకున్నదాని కంటే ముందుగానే వస్తోందా?
17 April 2024, 10:57 IST
- Tillu Square OTT Release Date: టిల్లూ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై మరోసారి బజ్ నెలకొంది. ఊహించిన దానికంటే వారం ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుందని అంచనా వేస్తున్నారు.
టిల్లూ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్.. అనుకున్నదాని కంటే ముందుగానే వస్తోందా?
Tillu Square OTT Release Date: సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లూ స్క్వేర్ మూవీ థియేటర్లలో రిలీజై మూడు వారాలైనా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై మరోసారి బజ్ నెలకొంది. ఇప్పటి వరకూ అనుకున్నదాని కంటే వారం ముందే మూవీ ఓటీటీలోకి వస్తుందని భావిస్తున్నారు.
టిల్లూ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్
టిల్లూ స్క్వేర్ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆ ఓటీటీ మే 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా వారం ముందుగానే అంటే ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్
సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ నటించిన టిల్లూ స్క్వేర్ మూవీ మార్చి 29న రిలీజైంది. చాలా నెలలుగా ఊరించి మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూడు వారాలైనా మూవీ వసూళ్లు తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని మేకర్స్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 రోజుల్లో రూ.125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. “డబుల్ బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ చేరింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇంత భారీ బ్లాక్‍బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.
టిల్లు స్క్వేర్ మూవీతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు జొన్నలగడ్డ అడుగుపెట్టారు. 9 రోజుల్లోనే ఈ చిత్రం ఆ మార్క్ చేరింది. తాను రూ.100 కోట్ల సినిమా కొడతానని మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సిద్ధు.. లక్ష్యం కంటే ముందే దాన్ని కొట్టేశారు. టిల్లు స్క్వేర్ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశారు సిద్ధు.
ఈ సినిమాకు పెద్ద పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. టిల్లూ స్క్వేర్ రిలీజైన మరుసటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ బోల్తా పడింది. మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మాత్రమే కాస్త పోటీ ఇచ్చింది. 2022లో వచ్చిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ టిల్లూ స్క్వేర్ లో సిద్దూ నటన, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
టిల్లూ స్క్వేర్ డిజిటల్ హక్కులు
టిల్లూ స్క్వేర్ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమా రూ.32 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అటు నెట్‌ఫ్లిక్స్ కూడా ఏకంగా రూ.35 కోట్లకు ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇప్పుడు థియేటర్లలో మూవీ సూపర్ హిట్ కావడంతో ఓటీటీలో సహజంగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉండనుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ తాను పెట్టిన భారీ మొత్తానికి ఈ సినిమా న్యాయం చేయనుంది.
టాపిక్