Regional Gems of 2022: ఈ ఏడాది ప్రాంతీయ చిత్రాలదే హవా.. కాంతార నుంచి కార్తికేయ వరకు..!
21 December 2022, 6:36 IST
- Regional Gems of 2022: కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు తగ్గుతున్న తరుణంలో ఈ ఏడాది అదిరిపోయే వసూళ్లతో కొన్ని చిత్రాలు ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ చిత్రాలను పక్కకు నెట్టి బాక్సాఫీస్ వద్ద ప్రాంతీయ చిత్రాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
2022లో పాన్ ఇండియా ప్రభంజనాలు
Regional Gems of 2022: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా సినీ రంగానికి పెద్ద కుదుపేనని చెప్పాలి. ఇప్పటి వరకు భారత చలనచిత్రసీమలో రారాజులా వెలుగొందిన బాలీవుడ్‌కు చేదు అనుభవాలను మిగిల్చింది. అడపా దడపా హిట్లు మినహా.. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఓటీటీలకు పెరిగిన ఆదరణ కారణంగా ప్రాంతీయ చిత్రాలపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో థియేటర్లలో కొన్ని సినిమాలు అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది ప్రాంతీయ చిత్రాలదే హవా నడిచింది. ఆర్ఆర్ఆర్ మొదలుకుని ఇటీవల వచ్చిన కాంతార వరకు థియేటర్లలో అద్భుత విజయాలతో దుమ్మురేపాయి. పాన్ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో 2022లో విశేష ప్రజాదరణ పొందిన ప్రాంతీయ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆర్ఆర్ఆర్(RRR-Telugu)..
ఈ జాబితాలో ముందుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పుకోవాలి. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేరా అని సందిగ్ధం నెలకొన్న సమయంలో ఈ సినిమా వాటన్నంటినీ పటాపంచలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లతో దూసుకెళ్లింది. ముఖ్యంగా విదేశీ ఆడియెన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఎంతలా అంటే సినిమా విడుదలై 6,7 నెలల తర్వాత కూడా ఇతర దేశాల్లో ఈ సినిమా మళ్లీ మళ్లీ ప్రదర్శించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల విదేశీ అవార్డులను దక్కించుకుంటూ ఆస్కార్ రేసులో నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విక్రమ్(Vikram-Tamil)..
కమల్ హాసన్‌కు చాలా రోజుల తర్వాత అదిరిపోయే విజయాన్ని ఇచ్చింది విక్రమ్ సినిమా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1986లో కమల్ నటించిన విక్రమ్ సినిమాకు అదే పేరుతో స్పిన్ఆఫ్ సీక్వెల్‌గా వచ్చింది. అంతేకాకుండా లోకేష్ తన రైటింగ్‌తో ఓ యూనివర్స్‌నే క్రియేట్ చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై వచ్చిన ఈ సినిమా వివిధ భాషల్లో అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.450 కోట్ల వసూళ్లను సాధించింది.
కేజీఎఫ్-2(KGF2- Kannada)..
కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మొదటి భాగం కంటే కూడా అదిరిపోయే వసూళ్లను సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలో తెరకెక్కినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు.1250 కోట్ల వసూళ్లతో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యశ్ హీరోగా చేసిన ఈ చిత్రంలో శ్రీనిధి హీరోయిన్. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు.
పెడవట్టు(Pedavattu-Malayalam)..
ఈ హైపర్ లోకల్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ ఈ ఏడాది వచ్చిన అండర్ రేటెడ్ సినిమాల్లో ఒకటి. కేరళలోని ఓ వ్యవసాయ గ్రామణం నేపథ్యంలో రూపొందిన సినిమా ఆలోచింపజేసేలా ఉంటుంది. అవినీతి రాజకీయ వ్యవస్థలో చిక్కుకుపోయిన ఓ యువ అథ్లెట్ సామాజిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ నాయకుడిగా ఎలా ఎదిగాడనేది కథ. నివీన్ పౌలీ తన అద్భుతమైన నటనతో ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. యోడ్లీ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి లిజు కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది.
కాంతార(Kantara- Kannada)..
కన్నడం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో కేజీఎఫ్2 అదిరిపోయే వసూళ్లను సాధించగా.. చివర్లో కాంతార సినిమా ప్రభంజనమే సృష్టించింది. పాన్ఇండియా వ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించిన నటించిన రిషభ్ శెట్టి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఫలితంగా ఈ సినిమా రూ.400 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ సంస్థే దీన్ని నిర్మించడం గమనార్హం.
కార్తికేయ 2(Karthikeya 2-Telugu)..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్‌గా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భగవాన్ శ్రీకృష్ణుని రహస్యాలను అన్వేషించే ప్రయాణం చుట్టూ తిరుగుతోంది. నిఖిల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతడి సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ చేసింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసిన అనుపమ్ ఖేర్ కథకు బూస్ట్ ఇచ్చే సన్నివేశంలో మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.130 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ అలరించింది.
ఇవి కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం, అడివి శేష్ మేజర్, కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ, మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్, మరాఠీ చిత్రం హబడ్డీ, పంజాబీ మూవీ ఓయ్ మఖ్‌నా లాంటి సినిమాలు ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓటీటీలోనూ మెప్పించాయి.