Thandel Release Date: నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే ఏడాదే..
05 November 2024, 15:45 IST
- Thandel Release Date: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంగళవారం (నవంబర్ 5) జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్లో మూవీ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే ఏడాదే..
Thandel Release Date: తండేల్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగ చైతన్య అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మచ్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. తండేల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ రిలీజ్ కాబోతోంది.
తండేల్ రిలీజ్ డేట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ ఏడాదే వస్తుందని భావించినా.. మేకర్స్ మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. మరో 10 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, అది పూర్తయిన తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతామని అతడు వెల్లడించాడు. తండేల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. బన్నీ వాస్ మూవీని ప్రొడ్యూస్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు.
రెండేళ్ల కిందట కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ అందించిన చందూ మొండేటి డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ఈ తండేల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లి అక్కడి నేవీ చేతికి చిక్కిన శ్రీకాకుళం జిల్లా జాలర్ల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమకథకు దేశభక్తిని జోడించి తీశారు.
తండేల్ డిజిటల్ హక్కులు
కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ తండేల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నాగ చైతన్య కూడా ఈ పాన్ ఇండియా మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అది నిజమే అని ఈ మధ్యే ఓ రిపోర్టు వెల్లడించింది. ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని భాషల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్లో గతంలో ఏ సినిమా డిజిటల్ హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదు. ఈ విషయంలో తండేల్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
తండేల్ కథేంటి?
గతంలో తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగచైతన్య రివీల్ చేశాడు. యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు నాగచైతన్య చెప్పాడు. 2018లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు.
అతడిని పాకిస్థాన్ నేవీ అరెస్ట్ చేసింది. ఆ సంఘటన స్ఫూర్తితో తండేల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు చైతన్య తెలిపాడు. ఏడాదిన్నర పాటు పాకిస్థాన్ జైలులో శిక్షను అనుభవించిన ఆ జాలరి ఎలా రిలీజయ్యాడు? ఆ జాలరిని క్షేమంగా ఇండియా రప్పించేందుకు అతడి ప్రియురాలు ఎలాంటి పోరాటం చేసిందనే అంశాలను తండేల్ సినిమాలో చూపించబోతున్నట్లు నాగచైతన్య తెలిపాడు. దేశభక్తి జానర్ కూడా తోడైన ఈ ప్రేమ కథను అతడు ఎలా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.