OTT Action Movie: నాలుగో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. వివరాలివే
29 October 2024, 14:50 IST
- Harom Hara OTT Streaming: హరోం హర చిత్రం ఏకంగా నాలుగో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు ఉన్న ఈ చిత్రం మరో దాంట్లో అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
OTT Action Movie: నాలుగో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. వివరాలివే
ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలు రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి. చాలా అరుదుగా కొన్ని సినిమాలు మూడు ఓటీటీల్లో కూడా అడుగుపెడుతున్నాయి. అయితే, ఓ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఏకంగా నాలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఆ చిత్రమే సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హరోం హర’. ఈ సినిమా నాలుగో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
స్ట్రీమింగ్ వివరాలివే
హరోం హర చిత్రం అక్టోబర్ 31వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆహా, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు నాలుగో ఓటీటీగా సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది.
హరోం హర చిత్రం ఈ ఏడాది జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకోవడం, ప్రమోషన్లను జోరుగా చేయడంతో మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఈ చిత్రానికి ఆరంభం నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు రాలేదు.
హిందీ కూడా కలుపుకుంటే ఐదు
ఆ తర్వాత జూలై 15వ తేదీన హరోం హర మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఒక్క రోజు గ్యాప్‍లో ఈటీవీ విన్‍లో ఎంట్రీ ఇచ్చింది. మరికొన్ని రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగులో నాలుగు ఓటీటీల్లో ఉండనుంది. అయితే, హరోం హర హిందీ వెర్షన్ ఇప్పటికే జియోసినిమాలో ఉంది. దీన్ని కూడా కలుపుకుంటే ఈ చిత్రం ఐదు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నట్టవుతుంది.
హరోం హర సినిమాకు జ్ఞానస్వాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. చిత్తూరు బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ రోల్‍లో సుధీర్ బాబు నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం సుమారు రూ.12కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, రూ.10కోట్ల కలెక్షన్ల మార్క్ దాటలేకపోయింది. దీంతో కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది.
హరోం హర మూవీలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్, అక్షర గౌడ, జయప్రకాశ్ కీలకపాత్రలు చేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ చేశారు.
కాగా, సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం అక్టోబర్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ కూడా పెద్దగా హిట్ కాలేకపోయింది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, సాయిచంద్ర, రాజు సుందరం, శశాంక్ కీలకపాత్రలు పోషించారు. అభిలాష్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మా నాన్న సూపర్ హీరో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.