Praneeth Hanumanthu: అతడికి ఛాన్స్ ఇచ్చిందుకు అసహ్యంగా ఉంది: యూట్యూబర్‌పై హీరో సుధీర్ బాబు ఫైర్.. కార్తికేయ కూడా..
Praneeth Hanumanthu Controversy: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, కార్తికేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు అలాంటి వ్యక్తి అని తెలియదని ట్వీట్ చేశారు. తన సినిమాలో అతడు నటించినందుకు అసహ్యంగా ఉందని సుధీర్ పేర్కొన్నారు.
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. తండ్రీకూతుళ్లకు చెందిన ఓ వీడియోపై అతడు అభ్యంతకరమైన కామెంట్లు చేస్తూ ఓ రియాక్షన్ వీడియోను చేశారు. దీనిపై ముందుగా మెగా హీరో సాయిధరణ్ తేజ్ స్పందించారు. ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తేజ్ ట్వీట్‍కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, డీజీపీ స్పందించారు. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హనుమంతుపై కేసు కూడా నమోదైంది. ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ హీరోలు సుధీర్ బాబు, కార్తికేయ నేడు (జూలై 8) స్పందించారు.
అసహ్యంగా ఉంది
హరోం హర సినిమాలో ప్రణీత్ హనుమంతుకు నటించే అవకాశం ఇచ్చినందుకు అసహ్యంగా ఫీల్ అవుతున్నానని సుధీర్ బాబు నేడు ట్వీట్ చేశారు. అతడు అంత భయంకరమైన వ్యక్తి అని తమకు తెలియదని, మూవీ టీమ్ తరఫున క్షమాణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ప్రణీత్ హనుమంతు చేసిన పని ఏ వాక్‍స్వాతంత్య్రం పరిధిలోకి రాదని సుధీర్ బాబు అభిప్రాయపడ్డారు. “మంచో చెడో నేను ఎక్కువగా సోషల్ మీడియా వాడను. హరోం హరలో ప్రణీత్ హనుమంతును నటింపజేసినందుకు మేం చాలా అసహ్యంగా భావిస్తున్నాం. నాతో పాటు మొత్తం మూవీ టీమ్ తరఫున హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నా. అతడు ఇంత హేయమైన వ్యక్తి అని మాకు తెలియదు. నా దృష్టికి ఎప్పుడూ రాలేదు” అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి దుష్ట మనసు కలిగిన వారు వ్యాప్తి చేయాలనుకునే రోత విషయాలకు వేదిక ఉండకుండా చేయాల్సిన అవసరం ఉందని సుధీర్ బాబు అభిప్రాయపడ్డారు.
అతడి ప్రశ్నలకు షాకయ్యా
భజే వాయువేగం సినిమా కోసం ప్రణీత్ హనుమంతుకు చెందిన ఫన్మంతు అనే యూట్యూబ్ ఛానెల్‍కు యంగ్ హీరో కార్తికేయ ఇంటర్వ్యూ ఇచ్చారు. హనుమంతుతో పాటు అతడి స్నేహితులైన మరికొందరు యూట్యూబర్లు కూడా ఉన్నారు. అయితే, ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్వూ ఇవ్వకుండా ఇవ్వాల్సిందని నేడు (జూలై 8) ట్వీట్ చేశారు కార్తికేయ.
ఆ ఇంటర్వ్యూలో ప్రణీత్ హనుమంతు, అతడి టీమ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను షాక్ అయ్యాయనని, కానీ గొడవ వద్దనుకొని స్పోర్టివ్‍గా తీసుకున్నానని చెప్పారు. “నేను వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చా. అయితే అది మూవీ ప్రమోషషన్లలో భాగమే. ఇతర ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టే వాళ్లకు ఇచ్చా. కానీ నేరుగా చెప్పాలంటే వాళ్లు అడిగిన కొన్ని ప్రశ్నలు నాకు కాస్త షాకింగ్‍గా అనిపించాయి. అయితే అక్కడ గొడవ వద్దనుకొని నేను అనుకున్నా. అందుకే వీలైనంత వరకు స్పోర్టివ్‍గా ఉండాలనుకున్నా” అని కార్తికేయ రాసుకొచ్చారు.
తనకు వారిపై అలాంటి అభిప్రాయమే ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి తలెత్తడంతో బయటికి చెబుతున్నానని కార్తికేయ పేర్కొన్నారు. “నేను అతడికి ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది కాదు. అయితే ప్రధాన నటుడిగా సినిమా రీచ్ పెంచేందుకు నా బాధ్యతల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా భాగమే. అయితే అలాంటి కంటెంట్‍ను ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నేను అందులో భాగమైనందుకు చాలా బాధగా ఫీలవుతున్నా. ఇప్పటి నుంచి నేను ఎవరికి ఇంటర్వ్వూ ఇస్తున్నానో చాలా జాగ్రత్తగా ఉంటా. మనం అలాంటి కంటెంట్‍ను ఎంకరేజ్ చేయకూడదు. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా” అని కార్తికేయ ట్వీట్ చేశారు.