Harom Hara OTT: ఓటీటీలోకి ఇంకా రాని హరోం హర సినిమా.. ప్రణీత్ హనుమంతు వివాదమే కారణం?
12 July 2024, 15:13 IST
- Harom Hara OTT: హరోం హర ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‍పై అఫీషియల్ ప్రకటన వచ్చినా.. ఆలస్యమైంది. అయితే, ప్రణీత్ హనుమంతు వివాదం వల్లే ఇలా జరుగుతోందని టాక్ ఉంది.
Harom Hara OTT: ఓటీటీలోకి ఇంకా రాని హరోం హర సినిమా.. ప్రణీత్ హనుమంతు వివాదమే కారణం?
హరోం హర సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా.. ఓటీటీలో చూద్దామని చాలా మంది భావించారు. ఈ మూవీ స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని అఫీషియల్ అప్‍డేట్ వెల్లడైంది. అయితే, నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ హరోం హర చిత్రం చెప్పిన తేదీకి ఓటీటీల్లోకి రాలేదు. అయితే, ఇందుకు ఓ కారణం ఉన్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
ప్రణీత్ హనుమంతు వల్లే..
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకున్నారు. తండ్రీకూతుళ్లకు చెందిన ఓ వీడియోపై తన యూట్యూబ్ ఛానెల్‍లో అతడు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఈ విషయంలో అతడిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీత్‍ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు రిమాండ్‍లో ఉన్నారు.
హరోం హర చిత్రంలో ప్రణీత్ హనుమంతు ఓ పాత్ర చేశాడు. ఈ చిత్రంలో అతడికి నటించే అవకాశం ఇచ్చినందుకు అసహ్యంగా ఉందని హీరో సుధీర్ బాబు.. ఇటీవలే ట్వీట్ చేశారు. ప్రణీత్ అలాంటి వాడని తమకు తెలియదని చెప్పారు. అతడికి అవకాశం ఇచ్చినందుకు తనతో పాటు మూవీ యూనిట్ తరపున అందరికీ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ప్రణీత్ హనుమంతు ఉన్న సీన్లను కట్ చేసి హరోం హర చిత్రాన్ని ఓటీటీల్లోకి తీసుకురావాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందట. ప్రణీత్ ఉన్న సీన్లను తొలగించే పని ప్రస్తుతం సాగుతోందని సమాచారం. అందుకే ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో జూలై 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రావాల్సిన ఈ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యమైందని సమాచారం. కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు త్వరలో ప్రకటించనున్నాయి.
అంచనాలను అందుకోని హరోం హర
హరోం హర చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో పాటు ఈ చిత్రంపై సుధీర్ బాబు చాలా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ మూవీ తప్పక హిట్ అవుతుందని ప్రమోషన్లలో చెప్పారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేశారు. అయితే, హైప్ ఏర్పడినా బాక్సాఫీస్ వద్ద హరోం హర సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.
హరోం హర చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ చేశారు. సునీల్, జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, ప్రణీత్ హనుమంతు కీలకపాత్రలు చేశారు. ఈ మూవీని డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. 1980 దశకం బ్యాక్‍డ్రాప్‍లో చిత్తూరులో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. తుపాకుల అక్రమ తయారీ చుట్టూ సాగుతుంది. అయితే, ఈ మూవీలో పుష్ప సినిమా ఛాయలు కూడా ఎక్కువగా కనిపించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మాణంలో హరోం హర చిత్రం రూపొందింది. సుధీర్ బాబు కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వచ్చింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు.