Harom Hara OTT Release Date: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Harom Hara OTT Release Date: హరోం హర సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన నెలలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హరోం హర’ విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో పాటు సుధీర్ బావ సూపర్ స్టార్ మహేశ్ బాబు సపోర్ట్ చేయటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. హరోం హర చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే మిక్స్ట్ టాక్ రావటంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కాగా, హరోం హర చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
ఓటీటీ డేట్ ఇదే
హరోం హర సినిమా జూలై 11వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో అడుగుపెడుతోంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ మంచి ధరకు ఈ చిత్రం హక్కులను దక్కించుకుందని సమాచారం.
మరో ఓటీటీలోనూ!
హరోం హర సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ప్లాట్‍ఫామ్ కూడా సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీంతో ఆహాతో పాటు ఈటీవీ విన్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై ఈటీవీ విన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ పేరు కూడా మొదట్లో వినిపించింది. అయితే, చివరికి ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలు రైట్స్ తీసుకున్నాయని సమాచారం.
హరోం హర చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో కుప్పంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్ కూడా ఓ మెయిన్ రోల్ చేశారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, ప్రణీత్ హనుమంతు కీరోల్స్ చేశారు.
హరోం హర చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ చేశారు. మంచి అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేకపోయింది.
హరోం హర స్టోరీ లైన్
హరోం హర సినిమా స్టోరీ 1980 దశకం బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. కుప్పంలో ముగ్గురు రౌడీలు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంటారు. అక్రమంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఆ కుప్పం ప్రాంతంలోని ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‍గా సుబ్రమహ్మణ్యం (సుధీర్ బాబు) వస్తాడు. అయితే, ఆ ముగ్గురు రౌడీల్లో ఒకరితో గొడవ వల్ల సుబ్రహ్మణ్యం ఉద్యోగం కోల్పోతాడు. అదే సమయంలో అతడికి డబ్బు అవసరం ఎక్కువవుతుంది. దీంతో సొంతంగా తుపాకులు తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకుంటాడు. సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స్ తయారు చేస్తాడు. క్రమంగా ఆ వ్యాపారంలో ఎదిగి చాలా డబ్బు సంపాదిస్తాడు. అయితే, అతడి కోసం పోలీసులు వెతుకుతారు. కొందరు శత్రువులు కూడా అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ తుపాకుల వ్యాపారాన్ని సుబ్రహ్మణ్యం ఎలా చేశాడు? ఏం సవాళ్లు ఎదురయ్యాయి? ఆ రౌడీల పనిని అతడు పట్టాడా? అనేవి హరోం హర చిత్రంలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.