Sivakarthikeyan: ముచ్చటగా మూడోసారి తండ్రయిన తమిళ హీరో.. బాలీవుడ్ హీరోకు తొలి సంతానం
04 June 2024, 7:49 IST
- Sivakarthikeyan: తమిళ హీరో శివకార్తికేయన్ ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన తొలి సంతానానికి వెల్కమ్ చెప్పడం విశేషం.
ముచ్చటగా మూడోసారి తండ్రయిన తమిళ హీరో.. బాలీవుడ్ హీరోకు తొలి సంతానం
Sivakarthikeyan: ఒకేసారి ఇటు సౌత్‌లో, అటు నార్త్‌లో టాప్ హీరోలు తండ్రులయ్యారు. తమిళ నటుడు శివకార్తికేయన్ మూడోసారి తండ్రవగా.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తొలిసారి ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని ఆ హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. శివకార్తికేయన్ కు ఇప్పటికే ఓ పాప, బాబు ఉండగా.. ఇప్పుడో మరోసారి బాబు జన్మించాడు.
శివకార్తికేయన్ ఫుల్ హ్యాపీ
తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి ముచ్చటగా మూడో సంతానానికి వెల్కమ్ చెప్పారు. ఈ విషయాన్ని అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. బాబు పుట్టాడు అంటూ అతడు అభిమానులతో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. తమిళంతోపాటు ఇంగ్లిష్ లోనూ అతడు ఈ పోస్టులు చేశాడు. తనకు అండగా నిలుస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.
"ప్రియమైన అందరికీ, మాకు బాబు జన్మించడంతో మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. జూన్ 2న బాబు పుట్టాడు. దీంతో మా కుటుంబం మరింత విస్తరించింది. ఎప్పటిలాగే మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు కావాలి. మీ గుగన్, ఆరాధన, ఆర్తి, శివకార్తికేయన్" అంటూ అతడు ఈ పోస్ట్ చేశాడు. ఆదివారం (జూన్ 2) రాత్రి తమకు బాబు జన్మించగా.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు.
శివకార్తికేయన్ మూడో సంతానం
శివకార్తికేయన్, ఆర్తి పెళ్లి 2010లో జరిగింది. ఇక 2013లో వీళ్లకు తొలి సంతానం కలిగింది. వాళ్లకు కూతురు ఆరాధన జన్మించింది. తర్వాత 2021లో కొడుకు గుగన్ జన్మించాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లు తల్లిదండ్రులయ్యారు. శివకార్తికేయన్ తరచూ తమ ఫ్యామిలీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యే అయలాన్ సినిమా ద్వారా అతడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు అమరన్ అనే మూవీలోనూ నటించాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ అశోక చక్ర అవార్డీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కావడం గమనార్హం. ఈ సినిమాలో సాయిపల్లవి కూడా నటిస్తోంది.
తండ్రయిన వరుణ్ ధావన్
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా తండ్రయ్యాడు. అతని భార్య నటాషా దలాల్ ఓ పాపకు జన్మనిచ్చింది. సోమవారం (జూన్ 3) రాత్రి ముంబైలోని ఓ హాస్పిటల్లో నటాషా ప్రసవించింది. ఈ జంటకు పాప పుట్టినట్లు వరుణ్ తండ్రి, డైరెక్టర్ డేవిడ్ ధావన్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పటి వరకూ ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చేయలేదు.
వరుణ్ తండ్రయిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. వరుణ్, నటాషా చాలా రోజుల డేటింగ్ తర్వాత జనవరి 24, 2021లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నటాషా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వాళ్లు వెల్లడించారు.