Ayalaan Review: అయలాన్ రివ్యూ - శివకార్తికేయన్ ఏలియన్ యాక్షన్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Ayalaan Review: శివకార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ అయలాన్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ కోలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
Ayalaan Review: శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా నటించిన తమిళ మూవీ అయలాన్ (Ayalaan) సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీతో ఆర్ రవికుమార్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రకుల్ ప్రీత్‌సింగ్ (Rakulpreet Singh) హీరోయిన్‌గా నటించింది. దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీ థియేటర్లలో యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. త్వరలో సన్‌నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఎలా ఉందంటే...
ఏలియన్‌తో ఫ్రెండ్‌షిప్...
తామిజ్ (శివకార్తికేయన్) ఓ రైతు. ప్రకృతితో పాటు పశుపక్ష్యాదులు అంటే ప్రాణం. పురుగులు, జంతువులకు హాని జరుగుతుందని ఫర్టిలైజర్స్ కెమికల్స్‌తో కాకుండా సేంద్రియవిధానంలోనే పంటలు పండిస్తుంటాడు. అవన్నీ తామిజ్‌కు నష్టాలే మిగుల్చుతాయి. అయినా సంతోషంగా బతుకుతుంటాడు. అప్పులు పెరిగిపోతున్నాయని అబద్ధం ఆడి తామిజ్‌ను అతడి తల్లి (భానుప్రియ) ఉద్యోగం కోసం బలవంతంగా సిటీకి పంపిస్తుంది. సిటీలో సర్‌ప్రైజ్ పార్టీలు అరెంజ్ చేసే (కరుణాకరణ్, యోగిబాబు) గ్యాంగ్‌లో ఒకడిగా తామిజ్ చేరిపోతాడు.
ఫ్యూయల్‌కు ప్రత్యామ్నాయంతో నోవా గ్యాస్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్). నోవా గ్యాస్‌ను వెలికితీయాడానికి స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు. ఆఫ్రికాలో అతడు చేసిన ప్రయోగం వికటించి వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. మరోసారి ఇండియాలోనే ఎవరికి తెలియకుండా ఓ మైన్‌లో రహస్యంగా నోవా గ్యాస్ ప్రయోగం చేస్తుంటాడు ఆర్యన్. అతడి దగ్గర ఉన్న స్పార్క్ కోసం వేరే గ్రహం నుంచి టాట్టూ అనే ఏలియన్ భూమిపైకి వస్తుంది. తామిజ్, ఏలియన్ మంచి ఫ్రెండ్స్ అవుతారు.
ఆర్యన్ దగ్గర ఉన్న స్పార్క్‌ను కొట్టేసి తన గ్రహానికి వెళ్లిపోవాలని ఏలియన్ అనుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఏలియన్‌కు సహాయం చేసిన తామిజ్ ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. కొన ఊపిరితో ఉన్నతామిజ్‌ను బతికించడానికి తన పవర్స్‌ను అతడికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ఏలియన్. పవర్స్ పోయిన ఏలియన్‌ను ఆర్యన్ గ్యాంగ్ పట్టుకొని బంధిస్తారు?
ఆ తర్వాత ఏమైంది. ఆర్యన్ గ్యాంగ్ నుంచి ఎలియన్‌ను తామిజ్ ఎలా కాపాడాడు? ఏలియన్ కొట్టేసిన స్పార్క్‌ను ఆర్యన్ తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు? ఆర్యన్‌ను ఏలియన్ టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? ఆర్యన్ చేసిన ప్రయోగం కారణంగా చెన్నై నగరం ఎలా అతలాకుతలం అయ్యింది. అతడి ప్రయోగాన్ని తామిజ్, ఏలియన్ కలిసి అడ్డుకున్నారా? తామిజ్ ప్రేమించిన సైన్స్ టీచర్ తార ఎవరు? అన్నది ఈ మూవీ(Ayalaan Review) కథ.
ఏలియన్ మన జోనర్ కాదు...
ఏలియన్ మన జోనర్ కాదు...అయలాన్ సినిమాలో హీరోశివకార్తికేయన్‌తో కమెడియన్ కరుణాకరన్ ఓ డైలాగ్ చెబుతాడు. సినిమా చూస్తుంటే డైలాగ్ పదే పదే గుర్తుకొస్తుంది. ఏలియన్ జోనర్‌లో హాలీవుడ్‌లో తప్ప మిగిలిన భాషల్లో లెక్కపెట్టగలిగే సినిమాలే వచ్చాయి. ఏలియన్ సినిమా అంటేనే గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులతో కూడుకొని ఉంటుంది. ఈ భారీ బడ్జెట్ కథలను మనవైన ఎమోషన్స్‌తో చెప్పడం కత్తిమీద సాములాంటిదే. అయలాన్‌తో తొలి ప్రయత్నంలోనే పెద్ద సాహసానికి పూనుకున్నా రవికుమార్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడని అనిపిస్తుంది.
డైరెక్టర్ కష్టం...
ఓ సైంటిస్ట్ చేస్తోన్న ప్రమాదకరమైన ప్రయోగాన్ని ఏలియన్ సహాయంతో ఓ యువకుడు ఎలా అడ్డుకున్నాడన్నదే ఈ సినిమా కథ. కామెడీ, యాక్షన్ అంశాలతో దాదాపు రెండున్నర గంటల్లో చెప్పడానికి డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. ఏలియన్ చేత ఫైట్స్, కామెడీ అన్ని చేయించాడు.
అంత ఏలియన్ చేస్తే హీరో సైడ్ అయిపోతాడని భావించి అతడికి సూపర్ పవర్స్ ట్రాన్స్‌ఫర్ చేసి శివకార్తికేయన్ ఫ్యాన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశారు. ఓ లవ్‌స్టోరీని కూడా యాడ్ చేశాడు. కానీ అవన్నీ టైమ్‌పాస్ వ్యవహారంగానే కనిపిస్తాయి.
ప్రీ క్లైమాక్స్‌లో ఏలియన్, ఆర్యన్ తిరిగి కలిసిన ఆర్యన్ ప్రయోగాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. సీరియస్‌గా సాగాల్సిన చోట డైరెక్టర్ కామెడీ చేయడం కన్వీన్సింగ్‌గా అనిపించదు.
మెసేజ్ బాగుంది...
ఏలియన్ పాత్రతో దర్శకుడు చెప్పిన మెసేజ్ బాగుంది. మనుషులు, జంతువులతో పాటు భూమిపై నివసించే అన్ని ప్రాణులు సమానమేనని చెప్పాడు. భూమిపై అన్నింటికంటే ప్రమాదకరమైంది మనిషేనని, తన స్వార్థం కోసం ప్రకృతిని మనుషులు ఎలా నాశనం చేస్తున్నారో చూపించాడు. జంక్‌ఫుడ్, ప్లాస్టిక్ వినియోగం వంటివాటిపై డైలాగ్స్ ద్వారా సందేశాన్ని చెప్పాడు.
హాలీవుడ్‌కు ధీటుగా...
గ్రాఫిక్స్ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవచ్చు. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ హాలీవుడ్ సినిమాలకు తగ్గట్లుగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి.
శివకార్తికేయన్ వన్ మెన్ షో...
తామిజ్‌కు శివకార్తికేయన్ కామెడీతో పాటు యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టాడు. కంప్లీట్ శివకార్తికేయన్ వన్ మెన్ షోగాఈ మూవీ నిలుస్తుంది. ఏలియన్ . శివకార్తికేయన్ కాంబినేషన్‌లో కామెడీ సన్స్ వర్కవుట్ అయ్యాయి. ఏలియన్‌కు సిద్ధార్థ్ డబ్బింగ్ చక్కగా కుదిరింది.
తారగా రకుల్ హీరోయిన్‌కు తక్కువ, గెస్ట్ రోల్‌కు ఎక్కువ అన్నట్లుగా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమాలో అరగంట కంటే తక్కువే రకుల్ కనిపిస్తుంది. మెయిన్ విలన్ శరద్ ఖేల్కర్ కంటే ఇషా కొప్పికర్ ఎక్కువగా షైన్ అయ్యింది. ఆమె విలనిజం ఆకట్టుకుంటుంది. కరుణాకర్, యోగిబాబు కామెడీ బోరింగ్‌గా సాగుతుంది. ఏఆర్ రెహమాన్ పాటలు, బీజీఎమ్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి.
Ayalaan Review -అయలాన్‌కు ప్లస్
ఏలియన్ కథ దక్షిణాది ఆడియెన్స్‌కు కొత్త కావడంతో అయలాన్‌కు పెద్ద ప్లస్ పాయింట్. చిన్న చిన్న లోపాలున్నా కామెడీ, యాక్షన్‌తో ఈ మూవీ మెప్పిస్తుంది. శివకార్తికేయన్ యాక్టింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు.