తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Swag Review: స్వాగ్ రివ్యూ- శ్రీ విష్ణు ఐదు క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన‌ మూవీ ఎలా ఉందంటే?

Swag Review: స్వాగ్ రివ్యూ- శ్రీ విష్ణు ఐదు క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన‌ మూవీ ఎలా ఉందంటే?

04 October 2024, 14:32 IST

google News
  • Swag Review: శ్రీవిష్ణు హీరోగా హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స్వాగ్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్రొడ్యూస్ చేసింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన స్వాగ్ మూవీ ఎలా ఉందంటే?

స్వాగ్ రివ్యూ
స్వాగ్ రివ్యూ

స్వాగ్ రివ్యూ

Swag Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో టాలీవుడ్‌లో హీరోగా త‌న‌కుంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. మ‌రో వైవిధ్య‌మైన క‌థాంశాన్ని ఎంచుకుంటూ శ్రీవిష్ణు చేసిన స్వాగ్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మీరా జాస్మిన్ కీల‌క పాత్ర చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్వాగ్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

శ్వాగ‌ణిక వంశ వార‌సుల కథ‌...

భ‌వ‌భూతి (శ్రీవిష్ణు) ఎస్ఐగా ప‌నిచేసి రిటైర్ అవుతాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల‌ భార్య రేవ‌తి (మీరా జాస్మిన్‌) అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. రేవ‌తి కార‌ణంగా ఆడ‌వాళ్లు అంద‌రిపై ద్వేషాన్ని పెంచుకుంటాడు భ‌వ‌భూతి. శ్వాగ‌ణిక వంశ వార‌స‌త్వానికి సంబంధించి భ‌వ‌భూతికి ఓ లెట‌ర్ వ‌స్తుంది.

కోట్ల రూపాయ‌ల ఆస్తి కోసం వంశ వృక్ష నిల‌యానికి వెళ్లిన భ‌వ‌భూతికి అలాంటి లెట‌ర్‌తోనే అక్క‌డికి వ‌చ్చిన సింగ‌(శ్రీవిష్ణు), అనుభూతి ( రీతూ వ‌ర్మ‌) క‌నిపిస్తారు. వారికి ఈ లేఖ‌లు పంపించిన విభూతి(శ్రీవిష్ణు) ఎవ‌రు? ఈ ముగ్గురిలో శ్వాగ‌ణిక ఆస్తి ఎవ‌రికి ద‌క్కింది? భ‌వ‌భూతి, సింగల‌కు ఆస్తి ద‌క్క‌కుండా య‌యాతి (శ్రీవిష్ణు)ఏం చేశాడు?

1551 ఏళ్ల క్రితం పురుషుల‌పై ఆధిప‌త్యం చెలాయించిన వింజ‌మ‌ర వంశ రాణి రుక్మిణి దేవి (రీతూ వ‌ర్మ‌) క‌థేమిటి? పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌ను నిల‌బెట్ట‌డానికి శ్వాగ‌ణిక మూల‌పురుషుడు భ‌వ‌భూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? ఈ క‌థ‌లోకి విభూతి ఎలా వ‌చ్చాడు? శ్వాగ‌ణిక వంశ నిధి చివ‌ర‌కు ఎవ‌రికి ద‌క్కింది? అన్న‌దే స్వాగ్ మూవీ క‌థ‌.

లింగ వివ‌క్ష నేప‌థ్యంలో...

లింగ వివ‌క్ష అన్న‌ది స‌మాజంలో త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండ‌ర్లు కూడా మ‌నుషులేన‌నే పాయింట్‌కు కామెడీ, ఎమోష‌న్స్ జోడించి ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి స్వాగ్ మూవీని తెర‌కెక్కించాడు.

స్వాగ్ క‌థ‌ పాత పాత‌దే. ఈ మూవీలో చ‌ర్చించిన పాయింట్‌తో గ‌తంలో తెలుగులో కొన్ని సినిమాలొచ్చాయి. పాత క‌థ‌ల్ని కొత్త‌గా చెప్పే నేర్పు ద‌ర్శ‌కుల‌కు ఉన్న‌ప్పుడే స్క్రీన్‌పై మ్యాజిక్ జ‌రుగుతుంది. అలాంటి మ్యాజిక్ స్వాగ్‌లో క‌నిపిస్తుంది.

నేటిత‌రంతో క‌థ‌ను మొద‌లుపెట్టి ఒక్కో త‌రం ఫ్లాష్‌బ్యాక్‌ను చూపిస్తూ రాజుల కాలం వ‌ర‌కు గ‌మ్మ‌త్తుగా సినిమా సాగుతుంది. ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు అంద‌కుండా క‌థ‌ల‌ను లింక్ చేస్తే వ‌చ్చే ట్విస్ట్‌లు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఓ ప‌క్క న‌వ్విస్తూనే తాను చెప్పాల‌నుకున్న సందేశాన్నిక‌న్వీన్సింగ్‌గా చెప్పాడు.

కామెడీ ప్ల‌స్ ఎమోష‌న్స్‌...

సినిమా ట్రైల‌ర్‌, టీజ‌ర్ చూసి ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లే. సినిమాలో కామెడీ మొత్తాన్ని ఫ‌స్ట్ హాఫ్‌కే ప‌రిమితం చేసిన డైరెక్ట‌ర్ సెకండాఫ్‌ను ఎమోష‌న‌ల్‌గా న‌డిపించారు. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల క‌థ నెమ్మ‌దిగా అనిపించిన శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌తో ఆ ఫీలింగ్‌ను దూరం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అచ్చ తెలుగులో హ‌సిత్ రాసిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.

ఐడియా బాగుంది కానీ...

ఇలాంటి ఐడియాను ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యే విధంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డం ఈజీ కాదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొన్ని చోట్ల క‌న్ఫ్యూజ్ అయ్యాడు. త‌రాలు, హీరోహీరోయిన్ల ఫ్యాష్‌బ్యాక్‌లు, వారి మ‌ధ్య సంబంధాల‌తో గంద‌ర‌గోళంగా సినిమా సాగిన‌ట్లు అనిపిస్తుంది. అర్థ‌మైతే ఆడియెన్‌కు సినిమా న‌చ్చుతుంది. ఏ మాత్రం క‌న్ఫ్యూజ్ అయినా సినిమా మొత్తం గ‌జిబిజిగా అనిపిస్తుంది.

శ్రీవిష్ణు ఐదు పాత్ర‌లు...

స్వాగ్ శ్రీవిష్ణు కెరీర్‌లో చాలా ట‌ఫ్‌ మూవీగా చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాలో ఐదు పాత్ర‌లు, ఏడు గెట‌ప్‌ల‌లో శ్రీవిష్ణు క‌నిపించారు. వాటి మ‌ధ్య లుక్‌, డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ ప‌రంగా వేరియేష‌న్స్ చూపించ‌డానికి శ్రీవిష్ణు ప‌డిన క‌ష్టం ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. రీతూ వ‌ర్మ పురుష‌ద్వేషిగా అద‌ర‌గొట్టింది. మ‌రో పాత్ర‌లో ఆమె న‌ట‌న బాగుంది. తెలుగులో మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాదిగా స్వాగ్ నిలుస్తుంది.

యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయింది. ర‌విబాబు, గోప‌రాజు ర‌మ‌ణ‌, సునీల్‌, గెట‌ప్ శ్రీను కామెడీ ఫ‌స్ట్ హాఫ్‌లో వ‌ర్క‌వుట్ అయ్యింది. ద‌క్షా న‌గార్క‌ర్ గ్లామ‌ర్‌తో మెప్పించింది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్సయింది. చిన్న సినిమా చూస్తున్నామ‌నే అనుభూతి ఎక్క‌డ క‌ల‌గ‌కుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బడ్జెట్ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా స్వాగ్ మూవీని తెర‌కెక్కించింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి.

కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌...

స్వాగ్ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుతుంది. శ్రీవిష్ణు, రీతూ వ‌ర్మ యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.

రేటింగ్‌: 3/5

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం