Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో మూవీ రివ్యూ - సుధీర్‌బాబు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?
11 October 2024, 7:09 IST
Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందిన మా నాన్న సూపర్ హీరో మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?
మా నాన్న సూపర్ హీరో మూవీ రివ్యూ
Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ దసరా కానుకగా శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి అభిలాష కంకర దర్శకత్వం వహించాడు. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ మూవీతో సుధీర్ బాబు హిట్టు కొట్టాడా? లేదా? అంటే?
జానీ కథ...
జానీ (సుధీర్ బాబు) చిన్నతనంలోనే తల్లికి దూరమవుతాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి గంజాయి కేసులో జైలు పాలవ్వడంతో జానీ అనాథగా మారిపోతాడు. శ్రీనివాస్(షాయాజీ షిండే)... జానీని దత్తత తీసుకుంటాడు. జానీ రాకతో శ్రీనివాస్ పరిస్థితి మొత్తం తలక్రిందులవుతుంది. స్టాక్ బ్రోకర్‌గా పనిచేసే శ్రీనివాస్ నష్టాల బారిన పడతాడు. ఊరంతా అప్పులు చేయడం మొదలుపెడతాడు. శ్రీనివాస్ భార్య కూడా చనిపోతుంది. కొడుకు వల్లే తన జీవితం నాశనమైందని జానీని ద్వేషిస్తుంటాడు శ్రీనివాస్.
జానీకి మాత్రం తండ్రే హీరో. శ్రీనివాస్ ఎంత ద్వేషిస్తే అంతకుమించి తండ్రిపై జానీ ప్రేమను కురిపిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చుతుంటాడు. పొలిటీషియన్ చేత శ్రీనివాస్ స్టార్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిస్తాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు శ్రీనివాస్‌కు అవసరమవుతాయి.
ప్రకాష్ (సాయిచంద్) అనే వ్యక్తికి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానీని ప్రకాష్ కోరుతాడు. ప్రకాష్ లాటరీ డబ్బులతో తండ్రి శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించవవచ్చని ప్లాన్ చేసిన జానీ అందుకు అంగీకరిస్తారు. ప్రకాష్, జానీ కలిసి సాగించిన జర్నీ ఎలాంటి మలుపులు తిరిగింది?
ప్రకాష్‌కు జానీకి ఉన్న సంబంధం ఏమిటి? తన సొంత తండ్రిని జానీ కలుసుకున్నాడా? తనను దత్తత తీసుకున్న తండ్రి కాపాడుకోవడం కోసం సొంత తండ్రిని మోసం చేయాలని జానీ ఎందుకు అనుకున్నాడు? మహేష్ ఎవరు? అన్నదే మా నాన్న సూపర్ హీరో మూవీ కథ.
బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా...
టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో తండ్రీకొడుకుల అనుబంధం అన్నది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా పేరుపడింది. ఈ కాన్సెప్ట్‌తో ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ యానిమల్ ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది.
తెలుగులో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో స్టార్ హీరోలు సినిమాలు చేసి అద్భుత విజయాల్ని అందుకున్నారు. మా నాన్న సూపర్ హీరో మూవీతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ జోనర్‌ను టచ్ చేశాడు హీరో సుధీర్ బాబు.
ఇద్దరు తండ్రులు...ఓ కొడుకు...
దూరమైన తన కొడుకు ప్రేమ కోసం పరితపించే సొంత తండ్రి...దగ్గరున్న కొడుకును అనుక్షణం ద్వేషించే దత్తత తీసుకున్న తండ్రి...వారి మధ్య ఓ కొడుకు జీవితం ఎలా సాగిందనే అంశాలతో సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు మా నాన్న సూపర్ హీరో మూవీని తెరకెక్కించాడు. ఆర్థిక అవసరాలు మనిషిని ఎలా స్వార్థపరుడిగా మారుస్తాయనే చిన్న సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు. తండ్రీకొడుకుల ఎమోషన్‌తో పాటు క్రైమ్, లవ్ ఎలిమెంట్స్‌కు కథలో దర్శకుడు చోటిచ్చాడు.
సింపుల్ ఎమోషన్స్...
ప్రకాష్ పాత్రతోనే మా నాన్న సూపర్ హీరో మూవీ మొదలవుతుంది. గంజాయి కేసులో ఇరుక్కొని అరెస్ట్ కావడం...జైలులో ఉంటూ కూడా కొడుకుకు ఉన్నత జీవితాన్ని అందివ్వాలని తాపత్రయపడుతూ పడే సీన్స్‌లో ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి.
మరోవైపు కొడుకు కారణంగానే తన జీవితం కష్టాలమయమైందని జానీని శ్రీనివాస్ ద్వేషించే సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా కథను ముందుకు నడిపించాడు డైరెక్టర్. సింపుల్ ఎమోషన్స్‌తో ఆ సీన్స్‌ను సహజంగా రాసుకున్నాడు. ఓవర్ మెలో డ్రామా ఎక్కడ కనిపించదు.
జానీ...ప్రకాష్ జర్నీ...
లాటరీలో గెలుచుకున్న కోటిన్నర రూపాయల కోసం జానీతో కలిసి ప్రకాష్ సాగించే జర్నీ చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. ఈ ప్రయాణంలో తన సొంత తండ్రిని జానీ ఎలా కలుసుకున్నాడు? తన తండ్రిని కాపాడుకోవడం కోసం స్వార్థంతో ఆలోచించిన జానీలో ఎలా మార్పు వచ్చిందన్నది క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ దర్శకుడు చూపించాడు.
ఎమోషన్స్ అంతగా పండకపోవడంతో కథలో కీలకమైన ఈ ట్రాక్ మొత్తం ఆర్టిఫీషియల్‌గా మారింది. రాజుసుందరం పాత్రతో చేసే కామెడీ కథకు సంబంధంలేని ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషనల్ ట్విస్ట్‌తో క్లైమాక్స్ ఎండ్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో సాయిచంద్, సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది.
ఎమోషనల్ రోల్‌లో...
నటుడిగా సుధీర్‌బాబును ఓ మెట్టు ఎక్కించిన మూవీ ఇది. గత సినిమాలకు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ రోల్‌లో నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు. దూరమైన కొడుకును కలుసుకోవాలని ఆరాటపడే తండ్రి పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. షాయాజీ షిండే యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది. ఆర్ణ, ఆమనితోపాటు మిగిలిన పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. అభిలాష్ కంకర కథకుడిగా, దర్శకుడిగా మొదటి మూవీతో మెప్పించాడు.
కాన్సెప్ట్ బాగుంది కానీ...
కాన్సెప్ట్, యాక్టింగ్ పరంగా మా నాన్న సూపర్ హీరో బాగుంది. తాను అనుకున్న పాయింట్‌ను స్క్రీన్‌పై తీసుకురావడంలో దర్శకుడి తడబాటు కారణంగా సినిమా నెమ్మదిగా సాగిన అనుభూతిని కలిగిస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా ఓ సారి సినిమాను చూడొచ్చు.
రేటింగ్:3/5