తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Still Chance To Oscars: ఆస్కార్‌కు వెళ్లడానికి ఆర్ఆర్ఆర్‌కు ఇంకా ఛాన్స్ ఉంది.. అది ఎలా అంటే?

RRR Still Chance to Oscars: ఆస్కార్‌కు వెళ్లడానికి ఆర్ఆర్ఆర్‌కు ఇంకా ఛాన్స్ ఉంది.. అది ఎలా అంటే?

21 September 2022, 11:02 IST

google News
    • RRR Chances for Oscars: భారత్ తరఫున ఆస్కార్ నామినేషన్ కోసం ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ గుజరాతీ చిత్రం ఛెల్లీ షోను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్స్
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్స్ (Twitter)

ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్స్

RRR could still Chance to the Oscars: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా మన దేశంలో కాకుండా పాశ్చాత్యా దేశాల్లో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీయుల నుంచి ఈ రేంజ్‌లో స్పందన వస్తుందని ఊహించలేదని స్వయాన దర్శకుడు రాజమౌళినే అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. సినిమా ఎంతగా అలరించిందో. దీంతో ఈ సినిమా అకాడమీ అవార్డులకు(Oscars) వెళ్తే తప్పనిసరిగా ఏదోక కేటగిరీలో పురస్కారం దక్కించుకుంటుందని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా గుజరాతి చిత్రం ఛెల్లో షోను దేశం తరఫున ఆస్కార్స్‌కు పంపనున్నట్లు భారత ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్స్‌కు ఎంపిక చేయకపోవడంపై ట్విటర్ వేదికగా నెటిజన్లు అసంతృప్తి తెలియజేస్తున్నారు. విదేశాల్లో మంచి ప్రశంసలు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్‌ను సెలక్ట్ చేయకపోవడమేంటని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ సినిమా అకాడమీ అవార్డులకు నామినేట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ఈ సినిమాకు పలు విభాగాల్లో ఆస్కార్ పొందేందుకు అవకాశమున్నట్లు ఆర్ఆర్ఆఱ్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ డిలన్ మార్చెట్టి వెరైటి అన్నారు.

ఈ సినిమా ఆస్కార్‌ అవార్డులకు పోటీ పడేందుకు గానూ.. తను ప్రచారం ప్రారంభిస్తున్నట్లు డిలన్ స్పష్టం చేశారు. అన్ని కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్‌కు ఓటు వేయాలని అకాడమీలోని 10 వేల మంది సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కింది విభాగాల్లో ఆర్ఆర్ఆర్‌ ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని ఆయన తెలిపారు.

- ఉత్తమ చిత్రం

- ఒరిజినల్ స్క్రీన్ ప్లే(ఎస్ఎస్ రాజమౌళి, వీవీ విజయేంద్రప్రసాద్)

- ఉత్తమ లీడ్ యాక్టర్(జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్)

- సపోర్టింగ్ యాక్టర్(అజయ్ దేవగణ్)

- సపోర్టింగ్ యాక్ట్రెస్(ఆలియా భట్)

- ఒరిజినల్ సాంగ్(నాటు నాటు)

- ఒరిజినల్ స్కోర్ (ఎంఎం కీరవాణి)

- సినిమాటోగ్రఫి(కేకే సెంథిల్).

ఈ విభాగాలతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, ఫిల్మ్ ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్- హెయిర్ స్టైలింగ్, సౌండ్-విజువల్ ఎఫెక్ట్స్‌ లాంటి కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్‌కు సబ్మిట్ చేసినట్లు డిలన్ తెలిపారు.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ఇంకా అకాడమీ స్ట్రీమింగ్ రూమ్‌కు చేరుకోలేదు. అకాడమీ స్ట్రీమింగ్ రూమ్‌లో ప్రదర్శితమవడానికి ఎంపికైతే.. స్క్రీన్‌పై చూసేందుకు ఓటర్లను ఆకర్షించగలదని అర్థం. గతేడాది సూర్య నటించిన సురరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) అకాడమీ స్ట్రీమింగ్‌ రూమ్‌లో ప్రదర్శించడానికి ఎంపిక చేశారు.

ఈ విషయంపై యూఎస్ డిస్ట్రిబ్యూటర్ డిలన్ మార్చెట్టి మాట్లాడుతూ.. "గత ఆరు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆర్ఆర్ఆర్ అలరించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 140 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంతేకాకుండా భారత్‌లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 14 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. హాలీవుడ్‌లో ప్రఖ్యాత టీసీఎసీఎల్ చైనీస్ ఐమాక్స్ థియేటర్ సహా విడుదలైన కొన్ని నెలల్లోనే ప్రేక్షకులను అలరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఆదరించారు. ఆర్ఆర్ఆర్‌ చిత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అకాడమీని ఆహ్వానిస్తున్నాం" అని తెలిపారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

తదుపరి వ్యాసం