Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్-10 లిస్టులో ఐదు భారతీయ సినిమాలు.. ఆర్ఆర్ఆర్ నుంచి భూల్ భూలియా వరకు
నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్-10 లిస్టులో ఐదు భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో గంగూబాయ్ కథియావాడి, పాన్ఇండియా బ్లాక్ బాస్టర్ ఆర్ఆర్ఆర్, కార్తిక్ ఆర్యన్, టబు నటించిన భూల్ భులియా 2 లాంటి చిత్రాలు ఉన్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ వేదికలను సబ్‌స్క్రైబ్ చేసుకునే వారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ చూసే వారు అధికమయ్యారు. ఈ గ్లోబల్ వేదికలో ఇండియన్ సినిమాలు కూడా దుమ్మురేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారతీయ సినిమాలు.. హాలీవుడ్ చిత్రాలను అధిగమించి మరీ ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్-10 లిస్టులో ఐదు భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఉపాధ్యక్షుడు మోనికా షెర్గిల్ ఈ విషయాన్ని తెలియజేశారు. వ్యూయర్షిప్ పరంగా ఐదు భారతీయ చిత్రాలు.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ విడుదల చేసిన టాప్-10 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే స్ట్రీమింగ్ సర్వీస్ 50 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. స్ట్రీమర్స్ ఫిల్మ్ డే సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన మోనికా సోమవారం నాడు గత 34 వారాల్లో 31 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్ నాన్ ఇంగ్లీష్ ఛార్ట్‌లో భారతీయ చిత్రాల హవా కనిపించిందని ఎత్తిచూపారు.
ఈ టాప్-10 లిస్టులో ఆలియా భట్ గంగూబాయ్ కథియావాడి, పాన్ఇండియా బ్లాక్ బాస్టర్ ఆర్ఆర్ఆర్, కార్తిక్ ఆర్యన్, టబు నటించిన భూల్ భులియా 2 లాంటి చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ఆలియా భట్ మరో హిట్ డార్లింగ్స్ కూడా ఇందులో ఉంది. ఈ సినిమా గృహ హింసపై సెటైరికల్‌గా తెరకెక్కించారు. షెఫాలీ షా, విజయ్ వర్మ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఫిల్మ్స్ డే సందర్భంగా చక్డా ఎక్స్ ప్రెస్, చోర్ నికల్ కే భాగా, జోగీ, కథల్, ఖుఫియా, మోనికా ఓ మై డార్లింగ్ లాంటి చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు.
సంబంధిత కథనం