RRR for Oscars: ఆస్కార్ వచ్చినా నాలో ఎలాంటి మార్పు ఉండదు: రాజమౌళి
RRR for Oscars: ఆస్కార్ వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాదని దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతడు ఈ సినిమా ఆస్కార్స్ రేసులో ఉండటంపై స్పందించాడు.
RRR for Oscars: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ఆర్‌ఆర్‌ఆర్. అంతకుముందు బాహుబలితోనే పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ లెవల్లో పేరు సంపాదించాడు. ఇప్పుడతని మూవీ ఏకంగా ఆస్కార్స్ రేసులో ఉందన్న వార్తలు ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడినీ గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది.
తాజాగా ఈ ఆర్‌ఆర్‌ఆర్ మూవీని వెస్టర్న్ కంట్రీస్‌లో ప్రమోట్ చేస్తున్న రాజమౌళి.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్కడ తన మూవీ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కనీసం రెండు కేటగిరీల్లో ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వెరైటీ అంచనా వేసిన నేపథ్యంలో రాజమౌళి దీనిపై స్పందించాడు.
ఆస్కార్ వచ్చినా ఇలాగే ఉంటా
"ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చినా, రాకపోయినా నా తర్వాతి సినిమా ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఆస్కార్ వస్తే ఇది నిజంగా సినిమా యూనిట్, దేశానికి కూడా పెద్ద బూస్ట్‌లా పని చేస్తుంది. అయితే ఇది నా పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు తీసుకురాదు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నేను ఎప్పుడూ వృద్ధిసాధిస్తూ ఉండాలి. కథను చెప్పే విధానాన్ని అప్‌డేట్ చేసుకుంటూనే ఉండాలి. అందుకే ఆస్కార్ వచ్చినా నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలనుకుంటున్నాను అన్నదానిలో మార్పు ఉండదు" అని రాజమౌళి అన్నాడు.
ఆస్కార్స్ రేసులో ఆర్‌ఆర్‌ఆర్ ఉండేలా అమెరికాలో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసి, వాటిని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తున్నాడు రాజమౌళి. గత 21 ఏళ్లుగా ఏ ఇండియన్ మూవీ కూడా అకాడెమీ అవార్డుకు నామినేట్ కాలేదు. చివరిసారి 2001లో ఆమిర్ ఖాన్ నటించిన లగాన్ మూవీ నామినేట్ అయింది. ఆ మూవీలాగే ఆర్‌ఆర్‌ఆర్ కూడా బ్రిటీష్ రాజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది.
ఆర్‌ఆర్‌ఆర్.. అధికారిక ఎంట్రీ అవుతుందా?
ఆర్ఆర్‌ఆర్ మూవీ ఆస్కార్స్ రేసులో ఉండబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యే వెరైటీ అనే పాపులర్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కూడా తన ప్రెడిక్షన్ లిస్ట్‌లో రెండు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్‌లో ఆశలు రేగాయి. అప్పటి నుంచీ #RRRforOscars ట్విటర్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
ఇక ఈ వారంలో భారత ప్రభుత్వమే ఇండియా నుంచి అకాడెమీ అవార్డుల కోసం అధికారిక ఎంట్రీలను పంపించనుంది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ట్విటర్‌లో ఫ్యాన్స్ దీని గురించే చర్చించుకుంటుండటంతో సోమవారం (సెప్టెంబర్ 19) మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ ఫర్ ఆస్కార్స్ టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా ఉంది.