Sivakarthikeyan Amaran: ఆర్మీ డ్రెస్సులో వెళ్లి భార్యను భయపెట్టిన శివకార్తికేయన్.. అమరన్ స్టార్ వీడియో వైరల్
14 November 2024, 11:45 IST
- Sivakarthikeyan Amaran: అమరన్ స్టార్ శివకార్తికేయన్ ఈ మూవీలో కనిపించినట్లుగా ఓ ఆర్మీ డ్రెస్సులో వెళ్లి తన భార్యను భయపెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అతడు మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఆర్మీ డ్రెస్సులో వెళ్లి భార్యను భయపెట్టిన శివకార్తికేయన్.. అమరన్ స్టార్ వీడియో వైరల్
Sivakarthikeyan Amaran: శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ థియేటర్లలో దూసుకెళ్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాలో ముకుంద్ వరదరాజన్ అనే ఆర్మీ మేజర్ పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. అయితే సినిమాలో వేసుకున్న అదే డ్రెస్సులో తన ఇంట్లోకి వెళ్లిన అతడు కిచెన్ లో వంట చేస్తున్న తన భార్యను భయపెట్టాడు.
శివకార్తికేయన్ ఫన్నీ వీడియో
అమరన్ స్టార్ శివకార్తికేయన్ తన భార్య ఆర్తికి బర్త్ డే విషెస్ చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అమరన్ మూవీలో తాను పోషించిన ముకుంద్ వరదరాజన్ పాత్ర వేసుకునే ఆర్మీ మేజర్ యూనిఫాంలో అతడు తన భార్యను భయపెట్టడం చూడొచ్చు.
కిచెన్ లో వంట చేస్తున్న తన వెనుకగా వెళ్లిన శివకార్తికేయన్ ను సడెన్ గా చూసి ఆర్తి మొదట్లో భయపడి, తర్వాత నవ్వుతుంది. అచ్చూ సినిమాలోలాగే అతడు ఈ యూనిఫాంలో కనిపించాడు. "హ్యాపీ హ్యాపీ బర్త్ డే ఆర్తి.. లవ్ యూ" అనే క్యాప్షన్ తో అతడు ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఫిదా అవుతున్నారు.
అమరన్ ఓటీటీ రిలీజ్
బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న అమరన్ మూవీ ఇప్పటికే రూ.250 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నిజానికి డిసెంబర్ తొలి వారంలోనే సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు.
కానీ థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తుండటం, ఇప్పటికీ మరిన్ని స్క్రీన్లు వచ్చి చేరుతుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంతటి సక్సెస్ సాధించిన అమరన్ టీమ్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించాడు. ఈ మూవీని నిర్మించిన కమల్ హాసన్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. అమరన్ మూవీ టీమ్ రజనీని కలిసింది.
ఎవరీ ముకుంద్ వరదరాజన్?
అమరన్ సినిమాలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్ర పోషించాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక సిరీస్‌లోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
మేజర్ ముకుంద్ భారత సైన్యంలోని రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పనిచేశారు. ఆయన అశోక చక్ర అవార్డ్ గ్రహిత. జమ్మూ, కాశ్మీర్‌లోని 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో మేజర్ మకుంద్ వరదరాజన్ సాహసోపేత చర్యలకు ఆయన మరణానంతరం అశోక చక్రను ప్రదానం చేశారు.