Amaran OTT Release Date: ఓటీటీలోకి సాయి పల్లవి, శివకార్తికేయన్ బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్.. స్ట్రీమింగ్ అప్పుడే!
Amaran OTT Release Date: ఓటీటీలోకి సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన అమరన్ మూవీ రావడం ఆలస్యం కానుందా? తాజాగా ఆ మూవీ సక్సెస్ చూసిన మేకర్స్.. ఓటీటీ రిలీజ్ ను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Amaran OTT Release Date: సాయి పల్లవి, శివకార్తికేయన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ మధ్యే వాళ్లు నటించిన అమరన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ ఇద్దరు నటీనటుల కెరీర్లోనే అత్యధికంగా ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో అమరన్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడనుందన్న వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను మరో వారం లేదా రెండు వారాల పాటు వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఆ లెక్కన అమరన్ మూవీ డిసెంబర్ 11న ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ సినిమా తెలుగులోనూ రిలీజైన విషయం తెలిసిందే.
బయోపిక్.. కమర్షియల్ సక్సెస్
సాధారణంగా బయోపిక్ మూవీస్ ఓ మోస్తరు సక్సెస్ సాధిస్తాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు తక్కువే. కానీ అమరన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. రిలీజైన మొదటి రోజు నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో క్రమంగా బాక్సాఫీస్ కలెక్షన్లు పెరుగుతూ వెళ్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇండియన్ ఆర్మీ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ లో పని చేసి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ మేజర్ పాత్రలో శివకార్తికేయన్, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు. వీళ్ల లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి అద్భుతంగా తెరకెక్కించాడు. కమల్ హాసన్ ఈ మూవీని నిర్మించడం విశేషం.
మూవీకి ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో థియేటర్లలో మరికొన్ని రోజులు నడిపించాలని భావిస్తున్నారు. తమిళనాడులో ఈ గురువారం (నవంబర్ 14) సూర్య నటించిన కంగువ కూడా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాకు కూడా ఈ అమరన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళంలోనే కాదు తెలుగులోనూ అమరన్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతోపాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రానుంది.