తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Aditya Narayan: అభిమానిని మైక్‌‌తో కొట్టి ఫోన్ విసిరేసిన సింగర్.. మండిపడుతున్న ఫ్యాన్స్

Singer Aditya Narayan: అభిమానిని మైక్‌‌తో కొట్టి ఫోన్ విసిరేసిన సింగర్.. మండిపడుతున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu

12 February 2024, 17:33 IST

google News
    • Singer Aditya: బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్, యాంకర్ అయిన ఆదిత్య నారాయణ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడు ఓ కాన్సర్ట్ లో అభిమానిని మైకుతో కొట్టి, అతని మొబైల్ దూరంగా విసిరేశాడు.
అభిమానిని మైకుతో కొట్టి అతని ఫోన్ విసిరేస్తున్న సింగర్ ఆదిత్య నారాయణ్
అభిమానిని మైకుతో కొట్టి అతని ఫోన్ విసిరేస్తున్న సింగర్ ఆదిత్య నారాయణ్

అభిమానిని మైకుతో కొట్టి అతని ఫోన్ విసిరేస్తున్న సింగర్ ఆదిత్య నారాయణ్

Singer Aditya: బాలీవుడ్ లో ఓ సింగర్ గా, టీవీ షోల హోస్ట్ గా పేరు సంపాదించిన ఆదిత్య నారాయణ్ చేసిన ఓ పని ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. చత్తీస్‌గఢ్ లో ఓ షోలో పాల్గొన్న ఆదిత్య.. పాట పాడుతూనే ఓ అభిమానిని మైకుతో కొట్టి అతని ఫోన్ విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఆదిత్య.. ఏంటీ పని?

ఛత్తీస్‌గఢ్ లోని బిలాయిలో ఓ కాన్సర్ట్ లో ఆదిత్య నారాయణ్ పాల్గొన్నాడు. 2006లో వచ్చిన డాన్ మూవీలోని ఆజ్ కీ రాత్ పాట పాడుతున్నాడు. స్టేజ్ పై అటూ ఇటూ తిరుగుతూ పాడుతుండగా.. సడెన్ గా కింద ఉన్న ఓ అభిమానిని మైకుతో కొట్టి అతని చేతుల్లోని మొబైల్ లాక్కొని దూరంగా విసిరేశాడు. తర్వాత మళ్లీ పాట పాడుతూ వెళ్లిపోయాడు.

మొదట మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నించగా ఆ అభిమాని ఇవ్వలేదు. దీంతో ఆదిత్య అతన్ని మైకుతో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "సింగర్ ఆదిత్య నారాయణ్ భిలాయిలోని రుంగ్టా కాన్సర్ట్ లో ఇలా ఓ అభిమానిని కొట్టి మొబైల్ విసిరేశాడు. అతడు ఎందుకిలా చేశాడన్నది తెలియడం లేదు" అని ఓ అభిమాని ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారి ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ఆదిత్యపై ఫ్యాన్స్ సీరియస్

బాలీవుడ్ లో లెజెండరీ సింగర్ గా ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్ కు పేరుంది. అతడు ఎంతో హుందాగా ఉంటాడు. కానీ ఆదిత్య మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఆ అభిమానులే లేకపోతే మీ ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారు అంటూ ఓ అభిమాని ఆదిత్యను గట్టిగానే నిలదీశాడు. తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటున్నాడని ఆ అభిమాని అన్నాడు.

అసలు మీ తండ్రి ఆ స్థాయిలో లేకపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చేవాడివా అంటూ మరో అభిమాని కూడా కడిగి పారేశారు. ఇంత అహంకారం పనికి రాదు అంటూ అందరు ఫ్యాన్స్ అతనికి క్లాస్ పీకారు. స్టేజ్ పై నడుస్తుండగా అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఆ అభిమాని చేయి అతని కాలికి తగిలిందని, ఆమాత్రం దానికే ఆదిత్య ఇంత దురుసుగా ప్రవర్తించాడని ఓ అభిమాని అసలు కారణాన్ని వివరించారు.

ఈ వివాదంపై ఆదిత్య నారాయణ్ స్పందించలేదు. చత్తీస్‌గడ్ లో తన షో ముగించుకొని అతడు ఢిల్లీ వెళ్లిపోయాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడు దిగి బయటకు వెళ్తున్న వీడియో కూడా వచ్చింది. అక్కడ తనకోసం వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడకుండానే ఆదిత్య వెళ్లిపోయాడు. ఈ మధ్యే వచ్చిన గదర్ 2 మూవీలో మై నిఖలా పాటను తన తండ్రి ఉదిత్ తో కలిసి ఆదిత్య పాడాడు. ఇండియన్ ఐడల్, సరిగమప షోల హోస్ట్ గానూ అతడు పాపులర్ అయ్యాడు.

తదుపరి వ్యాసం