Rahat Fateh Ali Khan: శిష్యుడిని చెప్పుతో కొట్టిన పాపులర్ సింగర్.. దుమారం రేపిన వీడియో.. కారణం?
Rahat Fateh Ali Khan Hits Student With Shoe: పాకిస్తాన్‌కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తన శిష్యుడిని చెప్పుతొ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అయితే తన శిష్యుడిని అలా ఎందుకు కొట్టానో తర్వాత వివరణ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేశాడు సింగర్ అలీ ఖాన్.
Rahat Fateh Ali Khan Hits Student Video Viral: పేరుకు ఎంతో గొప్ప సెలబ్రిటీలు అయిన ఒక్కోసారి అనుచితంగా ప్రవరిస్తుంటారు. ఒక్కోసారి వారి చర్యలు సగటు మనిషికి కోపం తెప్పించేలా ఉంటాయి. అలాంటి చర్యనే తాజాగా ప్రముఖ గాయకుడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన పాపులర్ సెలబ్రిటీ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ గురించి తెలిసిందే. పాకిస్తాన్‌లో కాకుండా ఆయనకు ఇండియాలో సైతం అభిమానులు ఉన్నారు.
అనేక హిందీ చిత్రాల్లో అద్భుతమైన సాంగ్స్ పాడి సూపర్ పాపులర్ అయ్యాడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్. ఆయన పాడిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అలాంటి సింగర్ రాహత్ అలీ ఖాన్ తాజాగా చేసిన చర్యపై నెటిజన్స్ మండిపడుతున్నారు. 49 ఏళ్ల రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తన శిష్యుడిని చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. దీంతో రాహత్ అలీ ఖాన్ అలా ఎందుకు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ, వీడియోను పోస్ట్ చేశారు నెటిజన్స్.
అయితే ఆ వీడియోలో ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో అతడిపై చేయి చేసుకున్నట్లు, తనను వదిలేయమని బాధితుడు ప్రాధేయపడుతుండటం ఉంది. అప్పుడే సహనం కోల్పోయిన రాహత్ అలీ ఖాన్ చెప్పుతో కొట్టాడు. దాంతో అక్కడున్న సిబ్బంది అలీ ఖాన్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ వివరణ ఇస్తూ మరో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో ఉన్నది తనేనని స్పష్టం చేశాడు రాహత్ అలీ ఖాన్. అలాగే బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పాడు.
ఇది గురు, శిష్యుల మధ్య విషయమని రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. బాధితుడు తన సొంత శిష్యుడని, కుమారుడిలాంటివాడని తెలిపాడు రాహత్. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలని పేర్కొన్నాడు. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తానని, తప్పు చేస్తే శిక్షిస్తానని రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తెలిపాడు. మందు బాటిల్ కనిపించకపోవడంతో తనను కొట్టానని అంతా అనుకుంటున్నారని, కానీ, అది పవిత్ర జలం ఉన్న బాటిల్ అని రాహత్ చెప్పుకొచ్చాడు.
అందుకే సహనం కోల్పోయి అలా చేయి చేసుకున్నట్లు చెప్పిన రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తర్వాత బాధితుడుకి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఈ సంఘటనపై వివరణ ఇచ్చిన వీడియోలో బాధితుడు కూడా మాట్లాడాడు. పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణం అని, అందుకే ఫతేహ్ అలీ ఖాన్ దండించారని సదరు బాధితుడు తెలిపాడు. అంతకుమించి ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు.
రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తనకు తండ్రి లాంటి వారని, తమను చాలా ప్రేమిస్తారని ఆ బాధితుడు తెలిపాడు. తమ గురువుకు (రాహత్ అలీ ఖాన్) భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారని అతను చెప్పుకొచ్చాడు. ఇదే వీడియోలో సింగర్ రాహత్ తనతో 40 ఏళ్లుగా పని చేస్తున్న ఓ వ్యక్తిని పరిచయం చేస్తూ అతను తన డ్రైవర్ అని చెప్పాడు. "రహత్ ఫతే అలీ ఖాన్‌ను నేను 40 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన చాలా మంచివారు" అని ఆ డ్రైవర్ తెలిపాడు.
అయితే, ఇలా వివరణలు ఇచ్చిన వీడియోలు పోస్ట్ చేసిన నెటిజన్స్ నెగెటివ్‌గా కామెంట్ చేయడం ఆపట్లేదు. దొరికిపోయానని కవర్ చేసుకోడానికి ఇలా చేస్తున్నాడంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాహత్ ఫతే అలీ ఖాన్ ఇలా వార్తల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. గతంలో అమెరికాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఆయనకు వీసా నిరాకరించడంతోపాటు విదేశీ ధనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.