తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shakhahaari Review: శాఖాహారి రివ్యూ - కన్నడ సూపర్ హిట్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Shakhahaari Review: శాఖాహారి రివ్యూ - కన్నడ సూపర్ హిట్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

29 May 2024, 11:19 IST

google News
  • Shakhahaari Movie Review: రంగాయ‌న ర‌ఘు ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన క‌న్న‌డ మూవీ శాఖాహారి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క‌న్న‌డ మూవీ ఎలా ఉందంటే?

శాఖాహారి మూవీ రివ్యూ
శాఖాహారి మూవీ రివ్యూ

శాఖాహారి మూవీ రివ్యూ

Shakhahaari Movie Review: రంగాయ‌న ర‌ఘు, గోపాల‌కృష్ణ దేశ్‌పాండే, విన‌య్‌యూజే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన క‌న్న‌డ మూవీ శాఖాహారి ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సందీప్ సుంకడ్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంల‌తో క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

సుబ్బ‌న్న హోట‌ల్ క‌థ‌...

సుబ్బ‌న్న(రంగాయ‌ణ ర‌ఘు) ఓ టిఫిన్ సెంట‌ర్ న‌డుపుతుంటాడు. యాభై ఏళ్లు దాటినా పెళ్లి కాదు. త‌మ్ముడు మిన‌హా బంధువులెవ‌రూ లేక‌పోవ‌డంతో ఒంట‌రిగా జీవిస్తుంటాడు. విజ‌య్ (విన‌య్ యూజే) ఓ అనాథ‌. స్కాల‌ర్‌షిప్‌తో చ‌దువు పూర్తిచేసుకొని బీఎస్ఎఫ్‌లో జాబ్ సంపాదిస్తాడు. సౌగంధిక (నిధి హెగ్డే) అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. పెళ్లైన కొద్దిరోజుల‌కే ట్రైనింగ్ కోసం విజ‌య్ రెండేళ్లు సౌగంధిక‌కు దూరంగా ఉండాల్సివ‌స్తుంది. ఈ టైమ్‌లో సౌగంధిక మ‌రో అబ్బాయితో స్నేహంగా తిర‌గ‌డం మొద‌లుపెడుతుంది.

స్నేహితుడి ద్వారా నిజం తెలిసుకున్న విజ‌య్ భార్య‌ను నిల‌దీయాల‌ని ఇంటికివ‌స్తాడు. అనుకోకుండా సౌగంధిక మ‌ర్డ‌ర్ కేసులో నిందితుడిగా మార‌తాడు. త‌న‌ను తాను నిర్దోషిగా నిరూపించుకోవ‌డానికి పోలీసుల నుంచి త‌ప్పించుకున్న విజ‌య్‌ బుల్లెట్ గాయంతో సుబ్బ‌న్న హోట‌ల్‌లో త‌ల‌దాచుకుంటాడు. విజ‌య్‌ క‌థ మొత్తం విన్న సుబ్బ‌న్న అత‌డిపై జాలితో గాయం నుంచి కోలుకునే వ‌ర‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌డానికి ఒప్పుకుంటాడు.

మ‌ల్లిఖార్జున (గోపాల‌కృష్ణ దేవ్‌పాండే) ఎస్ఐ. కుటుంబ‌బాధ్య‌త‌ల కార‌ణంగా ట్రాన్స్‌ఫ‌ర్ పెట్టుకుంటాడు. విజ‌య్ కేసు ఒక్క‌టి పూర్తిచేసి వెళ్లిపొమ్మ‌ని పై అధికారులు చెప్ప‌డంతో ఇష్టంలేక‌పోయిన అంగీక‌రిస్తాడు. కానీ విజ‌య్ క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకోవ‌డంతో మ‌ల్లిఖార్జున చిక్కుల్లో ప‌డ‌తాడు. విజ‌య్‌ను ప‌ట్టుకోక‌పోతే త‌న ఉద్యోగం ఊడిపోవ‌డ‌మే కాకుండా జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. సుబ్బ‌న్న ద‌గ్గ‌ర ఆశ్ర‌యం పొందుతోన్న విజ‌య్ ఆరోగ్యంవిష‌మించి చ‌నిపోతాడు.

ఆ త‌ర్వాత ఏమైంది? విజ‌య్ శ‌వాన్ని పోలీసుల‌కు క‌నిపించ‌కుండా సుబ్బ‌న్న ఏం చేశాడు? సౌగంధిక హ‌త్య‌కు సుబ్బ‌న్న త‌మ్ముడు మ‌ద‌న్న‌కు ఉన్న సంబంధం ఏమిటి? విజ‌య్‌కి జ‌రిగిన అన్యాయంపై సుబ్బ‌న్న ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? సుబ్బ‌న్న చేసిన నేరాల‌ను సాక్ష్యాధారాల‌తో మ‌ల్లిఖార్జున నిరూపించాడా? మ‌ల్లిఖార్జున‌, సుబ్బ‌న్న జీవితాలు ఎలా విషాదాంతంగా ముగిశాయి? సుబ్బ‌న్న‌ను ప్రేమించిన సుభ‌ద్ర ఎవ‌రు? అన్న‌దే శాఖాహారి మూవీ క‌థ‌.

క‌మ‌ర్షియ‌ల్ కోణానికి దూరంగా....

కొన్ని సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూడ‌లేము. రెగ్యుల‌ర్ సినిమాల్లో క‌నిపించే కామెడీ, యాక్ష‌న్‌, ల‌వ్ ట్రాక్ లాంటి వాణిజ్య హంగులు ఈ సినిమాల్లో ఉండ‌వు. న‌టుల ఇమేజ్‌ల‌ను కాకుండా క‌థ‌నే న‌మ్మి తెర‌కెక్కించే ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. శాఖాహారి ఓ కోవ‌కు చెందిన సినిమానే.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌...

చేయ‌ని త‌ప్పుకు దోషిగా మారిన ఓ యువ‌కుడు...కుటుంబ బాధ్య‌త‌ల‌కు, వృత్తి నిర్వ‌హ‌ణ‌కు మ‌ధ్య న‌లిగిపోయే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌...ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా ఓ చిన్న హోట‌ల్‌ను నిర్వ‌హించే ఓ మిడిల్ ఏజ్ వ్య‌క్తి... ముగ్గురు జీవితాల నేప‌థ్యంలో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు సందీప్ సుంకడ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

హీరోలు లేరు...

శాఖాహారి సినిమాలో హీరోలు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. నిజ‌జీవితంలో మ‌న చుట్టూ క‌నిపించే వ్య‌క్తుల‌ను పోలి ఉండేలా ప్ర‌తి క్యారెక్ట‌ర్స్‌ను చాలా స‌హ‌జంగా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. సుబ్బ‌న్న పాత్ర ఈ సినిమాకు ఎక్కువ‌గా హైలైట్ అయ్యింది. యాభై ఏళ్లు దాటిన వ్య‌క్తిని హీరోలా చూపిస్తూ సినిమా చేయ‌డ‌మే రిస్క్‌. ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఒక‌ర‌కంగా శాఖాహారి సినిమాకు సుబ్బ‌న్న‌నే హీరో..విల‌న్‌...క‌మెడియ‌న్.. ల‌వ‌ర్ బాయ్ అన్ని అనుకునేలా క్యారెక్ట‌ర్‌ను అద్భుతంగా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

క్రైమ్ ఎలిమెంట్స్‌...

ఆప‌ద‌లో ఉన్న యువ‌కుడికి సాయం చేయ‌బోయి తానే చిక్కుల్లో ప‌డ‌టం..ఆ నేరం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సుబ్బ‌న్న వేసిన ప్లాన్‌..రివేంజ్ తీర్చుకునే సీన్స్ గ్రిప్పింగ్‌గా అనిపిస్తాయి. . యాభై ఏళ్ల వ‌య‌సులో కూడా సుబ్బ‌న్న క్యారెక్ట‌ర్‌కు ఓ ల‌వ్‌స్టోరీని జోడించాల‌నే ద‌ర్శ‌కుడి ఐడియా బాగుంది. ఆ ల‌వ్‌స్టోరీ సెన్సిబుల్‌గా చూపించారు.

పోలీస్ ఇన్వేస్టిగేష‌న్‌...

విజ‌య్‌ని ప‌ట్టుకోవ‌డానికి ఎస్ఐ మ‌ల్లిఖార్జున చేసే ఇన్వేస్టిగేష‌న్ ఆక‌ట్టుకుంటుంది. కుటుంబ బాధ్య‌త‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూనే త‌న వృత్తికి న్యాయం చేయాల‌ని త‌పించే పోలీస్ ఆఫీస‌ర్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్ మెప్పిస్తాయి. విన‌య్ ప్రేమ‌..పెళ్లి క‌థ‌ను నాచుర‌ల్‌గా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌.

క్లైమాక్స్ లో ద‌ర్శ‌కుడు త‌న ప‌ట్టును క‌న‌బ‌రిచాడు. సుబ్బ‌న్న‌ను ప‌ట్టుకోవాల‌ని మ‌ల్లిఖార్జున‌..తాను చేసిన నేరాల‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొర‌క‌కూడ‌ద‌ని సుబ్బ‌న్న ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు ఉత్కంఠ‌ను పంచుతాయి. స‌ర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది.

ఆర్ట్ ఫిలిం త‌ర‌హాలో...

క్రైమ్ ఎలిమెంట్స్ బాగున్నా...ఆర్ట్ ఫిలిం త‌ర‌హాలో నెమ్మ‌దిగా క‌థ‌నం సాగ‌డ‌మే ఈ సినిమాకు మైన‌స్ అనిపిస్తుంది. హోట‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే కొన్ని అన‌వ‌స‌ర‌మైన సీన్స్ బోర్ కొట్టిస్తాయి.

సుబ్బ‌న్న పాత్ర‌లో...

సుబ్బ‌న్న పాత్ర‌లో రంగాయ‌ణ ర‌ఘు జీవించాడు. అమాయ‌కుడైన హోట‌ల్ ఓన‌ర్ పాత్ర‌లో స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. నిజంగానే పోలీస్ ఆఫీస‌ర్ అనిపించేలా గోపాల‌కృష్ణ దేశ్‌పాండే న‌ట‌న సాగింది. సినిమా మొత్తం సీరియ‌ల్ లుక్‌తో క‌నిపించి మెప్పించాడు.

విన‌య్ యూజే, నిధి హెగ్డేల పాత్ర‌ల నిడివి త‌క్కువే అయినా సినిమాలో ఎక్కువ‌గా హైలైట్ అయ్యారు. ఈ నాలుగు పాత్ర‌ల‌కే ఈ సినిమాలో ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉంది. సినిమా కోసం ఎంచుకున్న లొకేష‌న్స్ నాచుర‌ల్ ఫీల్‌ను క‌లిగించాయి.

డిఫ‌రెంట్ మూవీ...

శాఖాహారి కొత్త త‌ర‌హా అనుభూతిని పంచే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ. ప్ర‌ధాన పాత్ర‌ధారులు యాక్టింగ్‌...డైరెక్ట‌ర్ టేకింగ్ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుతాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం