Samantha in Temple: అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు
03 October 2024, 22:23 IST
- Samantha in Temple: కొండా సురేఖ కామెంట్స్ వివాదం నేపథ్యంలో సమంత గుడికి వెళ్లింది. నువ్వు చెప్పిన మాట విన్నానంటూ తాను గుడిలో దేవి ముందు కూర్చొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అమ్మా.. నువ్వు చెప్పిన మాట విన్నాను: గుడిలో సమంత ప్రత్యేక పూజలు
Samantha in Temple: సమంత నవరాత్రి మొదటి రోజు గుడికి వెళ్లింది. ఓవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై, నాగార్జున, నాగ చైతన్యలపై చేసిన కామెంట్స్ దుమారం రేపిన వేళ టాలీవుడ్ సెలబ్రిటీలంతా మండిపడుతుండగా.. సామ్ మాత్రం కోయంబత్తూర్ లోని లింగ భైరవ ఆలయానికి వెళ్లింది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
లింగ భైరవి ఆలయంలో సమంత
కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ అంతా తనకు అండగా నిలబడి సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలను ఖండిస్తుంటే.. మరోవైపు సమంత ఓ ఆలయాన్ని సందర్శించడం వైరల్ గా మారింది. నవరాత్రి తొలి రోజు సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న ఇషా ఫౌండేషన్ లింగ భైరవి దేవి ఆలయానికి ఆమె వెళ్లింది.
ఆ ఫొటోలను సామ్ షేర్ చేసింది. "నువ్వు చెప్పిన మాటే విన్నాను. థ్యాంక్యూ దేవి. హ్యాపీ నవరాత్రి టు ఆల్" అనే క్యాప్షన్ తో ఆ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో లింగ భైరవి దేవి ముందు సమంత రెండు చేతులూ జోడించి నిల్చొన్న ఫొటోతోపాటు ఆమె ముందు ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చొన్న ఫొటో కూడా ఉంది. ఇక ఇన్‌స్టా స్టోరీస్ లో ఆమె మరో ఫొటో షేర్ చేస్తూ.. నమ్మకమే మనకు కావాల్సింది అనే క్యాప్షన్ ఉంచింది.
కొండా సురేఖ కామెంట్స్ పై సమంత రియాక్షన్
తాను నాగ చైతన్యతో విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై సమంత ఇప్పటికే ఓ పోస్టు ద్వారా రియాక్టైంది. "నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి....చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ సమంత స్పందించింది.
నాగ చైతన్య రియాక్షన్ ఇదీ..
నాగచైతన్య కూడా తన మాజీ భార్య సమంతకు సపోర్ట్ చేశాడు. కొండా సురేఖ కామెంట్స్‌ను ఖండించాడు. కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. జీవితంలో విడాకులు తీసుకోవాలనే నిర్ణయం ఎంతో కఠినమైనది, బాధాకరమైనదని నాగచైతన్య అన్నాడు.
చాలా ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మినిస్టర్ వ్యాఖ్యలు ఏ మాత్రం అమోదయోగ్యం కాదని, సమాజంలో మహిళలకు గౌరవం, మద్ధతు దక్కడం ముఖ్యమని” నాగచైతన్య తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
టాపిక్