RRR Team Felicitation in Parliament: ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు పార్లమెంట్‌లో సన్మానం
17 March 2023, 15:39 IST
- RRR Team Felicitation in Parliament: ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు పార్లమెంట్‌లో సన్మానం చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం (మార్చి 17) బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఢిల్లీలో ల్యాండైన రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు
RRR Team Felicitation in Parliament: ఆస్కార్ గెలిచి ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగేలా చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ను ఘనంగా సన్మానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూవీ టీమ్ కు త్వరలోనే ఏకంగా పార్లమెంట్ లోనే సన్మానించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ సెర్మనీలో అవార్డు గెలిచిన తర్వాత శుక్రవారం (మార్చి 17) ఈ మూవీ టీమ్ ఇండియాలో అడుగుపెట్టింది. రామ్ చరణ్ ఒక్కడే ఢిల్లీ వెళ్లగా.. మిగిలిన టీమంతా హైదరాబాద్ వచ్చింది. అటు ఢిల్లీలో చరణ్ కు, ఇటు హైదరాబాద్ లో రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా మిగతా టీమ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఢిల్లీలో దిగిన చరణ్ ను ఎంపీ సీఎం రమేష్ కలిశారు. ఆ తర్వాత అతనితో దిగిన ఫొటోలను ట్విటర్ లో షేర్ చేస్తూ సన్మానం విషయాన్ని వెల్లడించారు. "నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచి ఇండియాలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముందుగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ను పార్లమెంట్ లో సన్మానించనున్నాం" అని రమేష్ ట్వీట్ చేశారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇండియా నుంచి అవార్డు అందుకున్న తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాటకుగాను మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి, పాట రాసిన చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. రిహానా, లేడీ గాగాలాంటి పాప్ స్టార్లను వెనక్కి నెట్టి మరీ నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం విశేషం.
అంతేకాదు ఈ పాటను ఆస్కార్స్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. వీళ్లతోపాటు తారక్, చరణ్ స్టేజ్ పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉన్నా.. రిహార్సల్స్ కు తగినంత సమయం లేకపోవడంతో వాళ్లు వద్దనుకున్నారు.