Ramcharan Returns To India: ఢిల్లీకి చరణ్ - హైదరాబాద్‌లో రాజమౌళి - ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభిమానుల గ్రాండ్ వెల్కమ్
Ramcharan Returns To India: ఆస్కార్స్ వేడుకలను ముగించుకున్న రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. రామ్‌చరణ్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దిగగా, రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ చేరుకున్నారు.
Ramcharan Returns To India: ఆస్కార్ వేడుకల్ని ముగించుకొని ఇండియా వచ్చిన రామ్ చరణ్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ మూవీ జెండాలతో పాటు పూలు చల్లుతూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రామ్‌చరణ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అంటూ అభిమానుల నినాదాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం దద్దరిల్లింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఆస్కార్ వేడుక కోసం ఫిబ్రవరి నెలాఖరున రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. పలు హాలీవుడ్ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్ పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో రాజమౌళి, ఎన్టీఆర్‌లతో కలిసి చరణ్ పాల్గొన్నాడు.
రెడ్‌కార్పెట్‌పై మెరిసి ఈ ఘనతను దక్కించుకున్న అతి తక్కువ మంది భారతీయ స్టార్స్‌లో ఒకరిగా ఎన్టీఆర్, చరణ్ నిలిచారు. ఆస్కార్ ప్రదానోత్సవం అనంతరం మార్చి 15న ఎన్టీఆర్ ఇండియాకు రాగా రామ్‌చరణ్ మాత్రం నాలుగు రోజులు ఆలస్యంగా ఇండియా వచ్చారు.
ఢిల్లీలో జరిగే ఓ ఈవెంట్‌లో ప్రధాని మోదీతో కలిసి రామ్‌చరణ్ పాల్గొననున్నాడు. ఈ వేడుక కోసం డైరెక్ట్‌గా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ ఈవెంట్‌ను ముగించుకొని శనివారం ఆయన హైదరాబాద్ రానున్నారు.
హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి - కీరవాణి
నాటు నాటు పాటకు ఆస్కార్స్‌ను సొంతం చేసుకున్న కీరవాణి, చంద్రబోస్ సగర్వంగా హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టారు. కీరవాణితో పాటు దర్శకుడు రాజమౌళి, వారి కుటుంబసభ్యులతో పాటు చంద్రబోస్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.
రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ చేరుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైహింద్ అంటూ రాజమౌళి నినదిస్తూ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయారు.