RRR | ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన బిల్డింగ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్
12 March 2022, 15:28 IST
- RRR మూవీ టీమ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ.. అంతకుముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
RRR.. ఈ ఏడాది బిగ్ బడ్జెట్ మూవీల్లో ఒకటైన రాధేశ్యామ్ కూడా రిలీజ్ అయిపోవడంతో ఇక అందరి దృష్టి అతి భారీ బడ్జెట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌పై పడింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే తన సినిమాల్లాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్‌లను చాలా గ్రాండ్‌గా, వెరైటీగా నిర్వహించే రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను కూడా ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన బిల్డింగ్ అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 18న ఈ వేడుక జరగనుంది. ఇన్ని రోజులూ రాధేశ్యామ్ రిలీజ్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ విషయంలో దూకుడుగా వెళ్లలేదు రాజమౌళి. ఇప్పుడా మూవీ కూడా రిలీజ్ అవడంతో ఇక పూర్తిస్థాయిలో తన మూవీ ప్రచారంపై దృష్టి పెట్టాడు. భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్ కూడా తిరిగి ఇండియాకు వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఇక నుంచి ప్రమోషనల్ ఈవెంట్‌లలో పాల్గొననున్నాడు.
ఇప్పటికే ఈ నెల 14న మూవీ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నెల 18న సాయంత్రం 7 గంటలకు బుర్జ్ ఖలీఫాలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రాజమౌళి తనయుడు కార్తికేయతోపాటు సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఇదే ఈవెంట్‌లో మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఉంటుందా లేదంటే మరో కొత్త ట్రైలరా అన్నది తెలియాల్సి ఉంది.
చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్
ఇక ఈ బుర్జ్ ఖలీఫా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్ రానున్నాడన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌పై ఎంతో హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు ప్రభాస్‌ను తీసుకొచ్చి ఆ హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి రాధేశ్యామ్ ప్రమోషనల్ ఈవెంట్‌లలో రాజమౌళి కూడా పాల్గొన్నాడు. ప్రభాస్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ కోసం వస్తున్నాడు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.