తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr | ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్.. సెలబ్రేషన్ యాంథెమ్‌కు డేట్ ఫిక్స్

RRR | ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్.. సెలబ్రేషన్ యాంథెమ్‌కు డేట్ ఫిక్స్

10 March 2022, 19:03 IST

google News
    • ఆర్ఆర్ఆర్ నుంచి మరోసాంగ్ విడుదల చేయనుంది చిత్రబృందం. ఎత్తరా జెండా అంటూ సాగే ఈ పాటను మార్చి 14న రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రణాళిక రూపొందించింది. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (twitter)

ఆర్ఆర్ఆర్

దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ముందు వరుసలో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఆఖరుకు ఈ ఏడాది జనవరి 7న తప్పకుండా విడుదలవుతుందని చిత్రబృందం నొక్కి చెప్పింది. అందుకు తగినట్లుగానే దేశమంతా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. కానీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావంతో మళ్లీ వాయిదా పడింది. చివరకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఫైనల్ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం కన్ఫార్మ్ చేసింది. ఇందుకు తగినట్లుగానే మరోసారి ప్రమోషన్లను ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలు విడుదలవగా మరో సాంగ్ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఆర్ఆర్ఆర్ నుంచి విడుదల కానున్న ఆ సాంగ్ ఎత్తరా జెండా అంటూ సాగుతుంది. ఈ పాటను మార్చి 14న విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ సన్నహాలు చేసింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్ ముగ్గురూ ఉన్న ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథెమ్‌గా ఈ పాటను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దోస్తీ, జననీ, నాటు నాటు, రాఘవన్, కొమురం భీముడా లాంటి సాంగ్స్ విడుదలై శ్రోతలను అలరించాయి. మరి ఈ సారి రానున్న ఎత్తరా జెండా సాంగ్ కూడా వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది.

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వాతంత్ర్య పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించారు. అయితే ఇది పూర్తిగా కల్పిత కథ అని, కేవలం వారి పేర్లను మాత్రమే సినిమాలో వాడామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలాయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.

తదుపరి వ్యాసం