RRR | ఫ్యాన్స్ మధ్య మొదలైన యుద్ధం.. సోషల్ మీడియాలో హంగామా
09 March 2022, 16:39 IST
- RRR.. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాక్సాఫీసును బద్ధలు కొట్టడానికి అటు ఆ మూవీ కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ లోపే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది.
ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
RRR మూవీ రిలీజ్‌కు మరో రెండు వారాలు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కలెక్షన్ల విషయంలో ఇండియన్ సినిమా రికార్డున్నింటినీ తిరగరాస్తుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
అటు అమెరికాలోనూ రిలీజ్‌కు ఎంతో ముందే ప్రీ సేల్స్‌తోనే మిలియన్ డాలర్లు ఆర్జించిందీ ఆర్‌ఆర్‌ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో అభిమానుల హడావిడి మామూలుగా లేదు. సాధారణంగా ఒక్క హీరో మూవీ రిలీజైతేనే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హీరో ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. ఇక ఇద్దరు హీరోలు, ఒకే సినిమాలో కనిపిస్తుంటే వాళ్ల ఎక్సైట్‌మెంట్ ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు.
అయితే ఇక్కడే మరో చిక్కు కూడా వచ్చి పడింది. ఈ మూవీని ఎవరు డామినేట్ చేస్తారన్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఎవరి హీరోను వాళ్లు ఆకాశానికెత్తుతున్నారు. మా హీరోనే మూవీని మొత్తం డామినేట్ చేస్తాడని ఒకరంటే.. లేదు మావోడే స్క్రీనంతా కనిపిస్తాడంటూ మరొకరు కౌంటర్ వేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానులు పోటాపోటీగా టికెట్లు కూడా కొనేస్తున్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ షో టికెట్లు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కొనేశారన్న విషయం తెలుసు కదా. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు కేవలం రామ్‌చరణ్ అభిమానుల కోసమే 30 షోలు వేస్తున్నారు తెలుసా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
వీళ్ల హడావిడి ఎలా ఉన్నా.. ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలూ తమ పాత్రలకు న్యాయం చేసినట్లు చెబుతూ వస్తున్నారు. ఇద్దరివీ సినిమాలో ముఖ్య పాత్రలే అని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ సినిమా విషయంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య యుద్ధం జరుగుతుండటమే కాస్త ఇబ్బంది కలిగించే విషయం.