తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv On Lawrence Bishnoi: ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్

RGV on Lawrence Bishnoi: ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్

Hari Prasad S HT Telugu

15 October 2024, 10:58 IST

google News
    • RGV on Lawrence Bishnoi: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపాలని చూస్తున్న లారెన్స్ బిష్ణోయ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ జింక కోసం 25 ఏళ్లుగా అతడు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు.
ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్

ఐదేళ్ల పిల్లవాడు.. 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా?: ఆర్జీవీ ట్వీట్ వైరల్

RGV on Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ అప్పుడెప్పుడో 1998లో ఓ కృష్ణ జింకను చంపాడన్న కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలుసు కదా. అయితే ఆ జింకను చంపాడన్న కోపంతో లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి సల్మాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కొన్నిసార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు.

అప్పుడతని వయసు ఐదేళ్లు

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపింది 1998లో. ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్ అప్పుడు కేవలం ఐదేళ్ల వయసున్న పిల్లాడని, అలాంటి వాడు ఓ జింక కోసం 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా అని ఆర్జీవీ ట్వీట్ చేయడం విశేషం.

"1998లో ఆ జింకను చంపినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం ఐదేళ్ల వయసున్న పిల్లాడు. అతడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను చంపాలనుకుంటున్నాడు. ఇది ఆ జంతువుపై ఉన్న విపరీతమైన ప్రేమా లేక దేవుడు ఆడుతున్న వింత నాటకమా" అంటూ ఆర్జీవీ తనదైన స్టైల్లో ప్రశ్నించాడు.

అంతకుముందు అదే లారెన్స్ బిష్ణోయ్ గురించి ఆర్జీవీ మరో ట్వీట్ కూడా చేశాడు. "గ్యాంగ్‌స్టర్ గా మారిన ఓ లాయర్ ఓ జింకను చంపిన నేరానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ సూపర్ స్టార్ ను హత్య చేయాలని చూస్తున్నాడు.

దీనికోసం తాను ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్న 700 మంది తన గ్యాంగ్ కు ఆర్డర్లు ఇస్తున్నాడు. అంతకుముందు అదే స్టార్ కు సన్నిహితుడైన ఓ రాజకీయ నాయకుడిని కూడా చంపాలని అనుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అతడు ప్రభుత్వ రక్షణలో ఓ జైల్లో ఉన్నాడు.

అతని అధికారి ప్రతినిధి విదేశాల నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే స్టోరీని ఎవరైనా బాలీవుడ్ రైటర్ రాసి ఉంటే.. ఎప్పుడూ లేనంత నమ్మశక్యం కాని, హాస్యాస్పద స్టోరీ రాసినందుకు అతన్ని కొట్టేవారేమో" అని ఆర్జీవీ మరో ట్వీట్ లో అన్నాడు.

అసలేంటీ కృష్ణ జింక కేసు?

1998లో సల్మాన్ ఖాన్ అప్పట్లో వచ్చిన హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఆ మూవీలోని హీరోయిన్లు సొనాలీ బింద్రేలాంటి వాళ్లు కూడా ఉన్నారు.

అయితే అప్పటి ఆ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇప్పటికీ సల్మాన్ ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్ కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కూడా ఇప్పటికే కాల్చి చంపారు.

దీంతో ఈ కేసుకు మరింత ప్రాధానత్య సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. మరోవైపు ఈ బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బాస్ 18 షోకి హోస్ట్ గా చేస్తూనే.. సికందర్ మూవీలోనూ నటిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం