బాబా సిద్దిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ సల్మాన్ ఖానేనా?
Baba Siddiqui Murder : బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు. ఇలా జరగడం మెుదటిసారి కాదు.. ఇంతకు ముందు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో సల్మాన్ స్నేహితులు ధిల్లాన్, గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా కాల్పులు జరిపింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు గుర్మైల్ బల్జీత్ సింగ్, ధరమ్రాజ్ రాజేష్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ప్రవీణ్ లోంకర్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు. బాబా సిద్ధిఖీ కూడా సల్మాన్‌కు స్నేహితుడు. కెనడాలో సల్మాన్ స్నేహితులు ఏపీ ధిల్లాన్, గిప్పీ గ్రేవాల్ ఇంట్లో కూడా గతంలో కాల్పులు జరిగాయి. తాజాగా సిద్ధిఖీ హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
బాబా సిద్ధిఖీని భద్రత కోసం ఒక పోలీసు కానిస్టేబుల్‌ను నియమించినట్లు ముంబై పోలీసులు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్ నగర్‌లోని బుబా సిద్దిఖీ (66) కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల రాత్రి ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిఖీని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుల వద్ద నుంచి రెండు పిస్తోళ్లు, 28 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
బాబా సిద్ధిఖీ వంటి పెద్ద నాయకుడిని బహిరంగంగా చంపడం ద్వారా లారెన్స్ బిష్ణోయ్ బహిరంగ హెచ్చరిక చేయడమే కాకుండా, సల్మాన్ ఖాన్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుంటున్నారా అనే ప్రశ్న వచ్చింది. ఇంతకు ముందు లారెన్స్ గ్యాంగ్ ధిల్లాన్, కెనడాలోని జిప్పీ గ్రేవాల్ ఇంటి వెలుపల కాల్పులు జరిపింది. ఇద్దరూ సల్మాన్‌తో కలిసి కనిపించడం లారెన్స్‌కు కోపం తెప్పించిందని కొందరి మాట. ఇప్పుడు బాబా సిద్ధిఖీ కేసులో లారెన్స్ కోణంపై దర్యాప్తు జరుగుతోంది.
బాబా సిద్ధిఖీ హత్యానంతరం బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన సోషల్ మీడియా పోస్టుల్లో సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించారు. దీంతో సల్మాన్ అభిమానుల్లో భయం పెరిగింది. ఈ హత్య కేసులో సల్మాన్ ఖాన్, బిష్ణోయ్ కోణాన్ని విచారిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు.
మరోవైపు బాంద్రాలోని బాబా సిద్ధిఖీ నివాసానికి వెళ్లిన సల్మాన్ ఖాన్ ఆయనకు నివాళులు అర్పించారు. ఆదివారం సాయంత్రం సల్మాన్ తన బాడీగార్డు షెరాతో కలిసి 'మక్బా హైట్స్ అపార్ట్ మెంట్'లోని సిద్ధిఖీ నివాసం నుంచి బయలుదేరారు. బాబా సిద్ధిఖీ, సల్మాన్ ఖాన్ స్నేహితులు. ఒకప్పుడు ఒకరికొకరు బద్ధశత్రువులుగా సల్మాన్ ఖాన్, మరో బాలీవుడ్ స్టార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు బాబా సిద్ధిఖీ మధ్యవర్తిత్వం వహించారు.
గత ఏడాది నవంబర్ 25న కెనడాలోని గిప్పీ గ్రేవాల్ బంగ్లాపై కాల్పులు జరిగాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఈ రోజు గిప్పీ గ్రేవాల్ బంగ్లాలో కాల్పులు జరిగాయి. ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు. ట్రైలర్ చూపించాం. పూర్తి సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.' అని లారెన్స్ గ్యాంగ్ ప్రకటించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో ఏపీ ధిల్లాన్ ఇంటిపై కూడా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటన తర్వాత కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా పోస్ట్ లో 'మేము విక్టోరియా ద్వీపంలో ఒకటి, వుడ్ బ్రిడ్జ్ టొరంటోలో మరొక కాల్పులు జరిపాం. నేను బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడిని.' అని లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి నుంచి ప్రకటన వెలువడింది.