పోలీసులపైకి కాల్పులు జరిపిన బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు.. ఎదురుకాల్పుల్లో మృతి-badlapur sexual assault accused akshay shinde opens fire at police shot dead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పోలీసులపైకి కాల్పులు జరిపిన బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు.. ఎదురుకాల్పుల్లో మృతి

పోలీసులపైకి కాల్పులు జరిపిన బద్లాపూర్ లైంగిక దాడి ఘటన నిందితుడు.. ఎదురుకాల్పుల్లో మృతి

Anand Sai HT Telugu
Sep 23, 2024 09:25 PM IST

Badlapur Rape Case : మహారాష్ట్రలోని బద్లాపూర్ పట్టణంలోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్ షిండే మృతి చెందాడు. పోలీసులపైకి కాల్పులు జరపగా.. ఎదురు కాల్పుల్లో మరణించాడు.

అక్షయ్ షిండే
అక్షయ్ షిండే

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్ పట్టణంలోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు అక్షయ్ షిండే మరణించాడు. ఒక అధికారి రివాల్వర్ లాక్కొని వారిపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. దీంతో అతడు మృతి చెందాడు.

నిందితుడు అక్షయ్ షిండేను ప్రొడక్షన్ వారెంట్ ఆధారంగా థానే క్రైమ్ బ్రాంచ్ సాయంత్రం 5:30 గంటలకు తలోజా జైలు నుండి కస్టడీకి తీసుకుంది. విచారణ నిమిత్తం థానేకు తీసుకెళ్లారు. వాహనం ముంబ్రా బైపాస్ సమీపంలోకి రాగానే ఒక అధికారి రివాల్వర్‌ను లాక్కొని రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు షిండే. దీంతో అధికారికి గాయాలయ్యాయి. అయితే మరో అధికారి షిండేపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

కేసు ఏంటంటే

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్ పట్టణంలోని పాఠశాల మరుగుదొడ్డి వద్ద ఇద్దరు బాలికలపై షిండే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గత నెలలో బద్లాపూర్ వీధుల్లో, స్థానిక రైల్వే స్టేషన్‌లో భారీ నిరసనలు చెలరేగాయి.

పాఠశాలలో ఆగస్టు 1న 23 ఏళ్ల షిండేను టాయిలెట్లను శుభ్రం చేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించారు. కానీ చేరిన 10 రోజుల్లోనే అతను వేర్వేరు రోజుల్లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

బద్లాపూర్ ఘటన తొలిదశలో చర్య తీసుకోవడంలో జాప్యం చేసిన బద్లాపూర్ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.

ఈ కేసుపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వాఖ్యలు చేసింది. బాలురకు అవగాహన కల్పించాలని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా తప్పొప్పులు నేర్పించాలని వ్యాఖ్యానించింది.

టాపిక్