Magadheera Bookings: మొదలైన మగధీర మూవీ బుకింగ్స్.. అప్పుడే హవా
24 March 2024, 15:05 IST
- Magadheera Re-release Bookings: మగధీర సినిమా రీ-రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ఈ టికెట్లు జోరుగా బుక్ అవుతున్నాయి. రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలోకి మళ్లీ వస్తోంది.
Magadheera Bookings: మొదలైన మగధీర మూవీ బుకింగ్స్.. అప్పుడే హవా
Magadheera Re-release Bookings: టాలీవుడ్‍లో మగధీర సినిమా ఒకానొక ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. దర్శక ధీరుడు ఎస్‍ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన మగధీర మూవీ 2009లో వచ్చి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. ఫ్యాంటసీ యాక్షన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. రామ్‍చరణ్‍ను స్టార్ హీరోగా నిలబెట్టింది. రాజమౌళి సత్తాను నిరూపించింది. ఇప్పటికీ ఈ చిత్రంలో సీన్లు, డైలాగ్‍లు, పాటలు చాలా చాలా మందికి గుర్తే ఉంటాయి. ఇప్పుడు, సుమారు 15 సంవత్సరాల తర్వాత మగధీర చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది.
మగధీర బుకింగ్స్ షురూ
రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన మగధీర సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చేస్తోంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్ కానుంది. ఈ ఎపిక్ మూవీని వెండితెరపై మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టికెట్ల బుకింగ్ నేడు (మార్చి 24) షురూ అయింది.
సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మగధీర స్పెషల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదలయ్యాలని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, మరిన్ని ప్లేస్‍లు, షోలు యాడ్ చేయనున్నట్టు ఆ ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. మార్చి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మగధీర స్పెషల్ షోలు మొదలవుతాయని పేర్కొంది.
మగధీర స్పెషల్ షోల బుకింగ్‍ల్లో అప్పుడే హవా కనిపిస్తోంది. కొన్ని చోట్ల టికెట్ల బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. రీ-రిలీజ్‍ల ట్రెండ్ జోరుగా సాగుతున్న ప్రస్తుతం తరుణంలో ఈ మూవీకి వసూళ్లు బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. మగధీర రీ-రిలీజ్ థియేటర్ల వద్ద రామ్‍చరణ్ అభిమానుల సందడి భారీగా కనిపించడం ఖాయమే.
మగధీర గురించి..
మగధీర సినిమా 2009 జూలై 31వ తేదీన విడుదలైంది. రాజుల కాలం నాటి 400 సంవత్సరాల ఫ్లాష్‍బ్యాక్‍తో ప్రస్తుత కాలంలోని లవ్ స్టోరీకి లింక్ చేసి రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ఈ సినిమాలో రామ్‍చరణ్ డ్యాన్స్, ఫైట్లు, వంద మందిని చంపే సీన్, డైలాగ్స్, పాటలు ఇలా చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
మగధీర చిత్రంలో కొన్ని సీన్లు ఐకానిక్‍గా నిలిచిపోయాయి. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో అగ్రదర్శకుడి స్థానానికి చేరారు రాజమౌళి. ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. సుమారు రూ.40 కోట్లతో రూపొందించిన ఈ చిత్రానికి రూ.100 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో దేవ్‍గిల్, శ్రీహరి, సునీల్ కీరోల్స్ చేశారు.
రామ్‍చరణ్ బర్త్ డే స్పెషల్స్
రామ్‍చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకతంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో ఇంకో మూవీ (RC17) అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్టు తెలుస్తోంది. దీంతో బ్లాక్ బస్టర్ రంగస్థలం కాంబో రిపీట్ కానుంది. రామ్‍చరణ్ - బుచ్చిబాబు (RC16) మూవీ టైటిల్ కూడా అదే రోజు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.
టాపిక్