Rajamaouli Meets Ted Sarandos: మహేష్ మూవీ కోసం రాజమౌళీ భారీ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్ సీఈఓను కలిసిన జక్కన్న..!
20 February 2023, 11:16 IST
- Rajamaouli Meets Ted Sarandos: రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మన జక్కన్న భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గతవారం నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్‌ను కూడా కలిశారు.
రాజమౌళి
Rajamaouli Meets Ted Sarandos: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వరించాయి. అంతేకాకుండా ఆస్కార్ తుది నామినేషన్‌లోనూ ఈ సినిమా పోటీ పడుతోంది. విడుదలైనప్పుడు అంతర్జాతీయంగా పెద్దగా ప్రభావం చూపనప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత వెస్టర్న్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదిలా ఉంటే ఎస్ఎస్ రాజమౌళీ.. నెట్‌ఫ్లిక్స్ సీఈఓను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రాజమౌళి.. నెట్‌ఫ్లిక్సీ సీఈఓ టెడ్ సరండరోస్‌ను కలవడంతో బజ్ ఏర్పడింది. గతవారం ఆయన భారత్‌కు రావడంతో నెట్‌ఫ్లిక్స్ ఓ పార్టీని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉత్తర, దక్షిణాది చిత్రప్రముఖులు కొంతమంది విచ్చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి కూడా హాజరై టెడ్ సరండరోస్‌ను కలిసినట్లు సమాచారం.
తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో రాజమౌళి తీస్తుండటంతో.. ఆ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ గురించి టెడ్ సరండరోస్‌తో జక్కన్న మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. హిందీతో పాటు మిగిలిన అన్నీ భాషల స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లోనే జరిగేలా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. SSMB29గా ఆ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకోవడంతో అవార్డుల ప్రదానోత్సవం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క మహేష్ బాబుతో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు జక్కన్న. మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కనుంది. కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.