Telugu Action OTT: ఓటీటీలోకి రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా యాక్షన్ లవ్‌స్టోరీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
14 September 2024, 19:43 IST
Telugu Action OTT: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వరలోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిరగబడరా సామీ మూవీకి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు.
తిరగబడరా సామీ ఓటీటీ
Telugu Action OTT: రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన తిరగబడరా సామీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహా ఓటీటీలో ఈ యాక్షన్ లవ్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. మూవీ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. సెప్టెంబర్ 20న తిరగబడరా సామీ ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నెగెటివ్ టాక్...
తిరగబడరా సామీ మూవీకి టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. ఔట్‌డేటెడ్ స్టోరీలైన్ కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. లవ్‌స్టోరీతో పాటు కామెడీ, ఎమోషన్స్‌ను డైరెక్టర్ సరిగ్గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయలేకపోయడంటూ కామెంట్స్ వినిపించాయి.
తిరగబడరా సామీ కథ ఇదే...
గిరి (రాజ్ తరుణ్) ఓ అనాథ. కొన్ని పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే అమ్మనాన్నలకు దూరమవుతాడు. తనలా ఎవరూ అనాథలా మిగిలిపోకూడదని తప్పిపోయిన వారిని వెతికిపెట్టి వారి కుటుంబాలకు దగ్గర చేయడమే పనిగా పెట్టుకుంటాడు. గిరి మంచి మనసు చూసి శైలజ (మాల్వీ మల్హోత్రా) అతడిని ఇష్టపడుతుంది.
శైలజను ప్రేమించిన గిరి ఆమెను పెళ్లిచేసుకుంటాడు ఇంతలోనే భార్య కోటీశ్వరురాలనే నిజం గిరికి తెలుస్తుంది. జహీరాబాద్ కొండారెడ్డి (మకందర్ దేశ్‌పాండే) అనే రౌడీ శైలజను చంపడానికి ప్రయత్నిస్తున్నాడనే నిజం బయటపడుతుంది. అతి భయస్తుడైన గిరి కరుడుగట్టిన రౌడీ బారి నుంచి శైలజను ఎలా కాపాడుకున్నాడు? శైలజ గురించి కొండారెడ్డి వెతకడానికి కారణమేమిటి? అన్నదే ఈ మూవీ కథ. తిరగబడరా సామీ సినిమాలో మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించింది. మకరంద్ దేశ్‌పాండే విలన్‌గా కనిపించాడు. జేబీ మ్యూజిక్ అందించాడు.
వివాదాలతోనే...
తిరగబడరా సామీ కంటే వివాదాలతోనే రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రేమ పేరుతో తనతో పదేళ్లు సహజీవనం చేసిన రాజ్‌తరుణ్ మోసం చేశాడు, మాల్వీ మల్హోత్రా కారణంగా తనకు దూరమయ్యాడంటూ లావణ్య అనే యువతి కేసు పెట్టింది.
ఆ తర్వాత ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది. లావణ్య ఆరోపణల్లో నిజం లేదని, రాజ్‌తరుణ్ సహ నటుడు మాత్రమే నంటూ మాల్వీ మల్హోత్రా క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ముంబైలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉండగా లావణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
మూడు సినిమాలు...
కాగా ఈ మూడు నెలల కాలంలో తిరగబడరా సామీతో పాటు పురుషోత్తముడు, భలే ఉన్నాడే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు రాజ్ తరుణ్. గత శుక్రవారం రిలీజైన భలే ఉన్నాడే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నది. డైరెక్టర్ మారుతి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి శివవర్ధన్ సాయి దర్శకత్వం వహించాడు.