Pushpa 2 Twitter Review: పుష్ప 2 మెగా బ్లాక్‌బస్టర్.. మెంటల్ మాస్ మూవీ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా.. నెగటివ్ కూడా..
05 December 2024, 7:09 IST
- Pushpa 2 Twitter Review: పుష్ప 2 మూవీ మెగా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు తేల్చేశారు. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి నుంచే స్పెషల్ షోలు ప్రారంభం కావడంతో రాత్రంతా ఎక్స్ వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తుండటం విశేషం.
పుష్ప 2 మెగా బ్లాక్‌బస్టర్.. మెంటల్ మాస్ మూవీ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా.. నెగటివ్ కూడా..
Pushpa 2 Twitter Review: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ రివ్యూలతో సోషల్ మీడియా ఎక్స్ నిండిపోతోంది. పుష్ప 2, వైల్డ్‌ఫైర్ ఫుష్ప, అల్లు అర్జున్ టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సహా ఎక్స్ లో చాలా మంది అభిమానులు, ప్రేక్షకులు పుష్ప 2 మూవీని మెగా బ్లాక్‌బస్టర్ గా తేల్చేశారు. మరి మూవీ ఎలా ఉంది? ఎక్స్ లో ప్రేక్షకుల అభిప్రాయాలేంటో ఒకసారి చూద్దాం.
పుష్ప 2 ట్విటర్ రివ్యూ
పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి 9.30 గంటల షోలతోనే హడావిడి మొదలైంది. దీంతో అర్ధరాత్రి దాటగానే మూవీ రివ్యూస్ వచ్చేశాయి. ఎక్స్ అకౌంట్లో ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. "ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే పుష్ప 2 మెగా బ్లాక్ బస్టర్. 4.5 రేటింగ్.
వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్.. ఏ విధంగా చూసినా సాలిడ్ మూవీ. అల్లు అర్జున్ కోసం అన్ని అవార్డులను సిద్దం చేయండి. అతడు అద్భుతానికి మించి.. సుకుమార్ ఓ మాంత్రికుడు.. బాక్సాఫీస్ టైఫూన్ వచ్చేసింది" అనే క్యాప్షన్ తో పుష్ప 2 రివ్యూ ఇవ్వడం గమనార్హం.
అల్లు అర్జున్ నటనకు ఫిదా
ఇక మిగిలిన వారి రివ్యూల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట పర్ఫార్మెన్స్.. ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే, ఇంటర్వెల్, బీజీఎం మరో లెవెల్.. కెమెరా మూవ్‌మెంట్స్, విజువల్స్ అద్భుతం అని ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటనకే చాలా మంది ఫిదా అవుతున్నారు.
దాదాపు ప్రతి రివ్యూలోనూ బన్నీ నటనకు వందకు వంద మార్కులు వేశారు. అతనితోపాటు జాతర సీక్వెన్స్, యాక్షన్ సీన్స్ సూపర్ అని మరో యూజర్ కామెంట్ చేశారు. చాలా వరకు ఎక్స్ లో 3.5 నుంచి 4.5 వరకు రేటింగ్ ఇచ్చారు. పుష్ప 2 మూవీ మెంటల్ మాస్ అంటూ ఓ ఎక్స్ యూజర్ 4.5 రేటింగ్ ఇవ్వడం విశేషం.
పుష్ప 2.. నెగటివ్ రివ్యూలు
అయితే పుష్ప 2 మూవీకి కొందరు నెగటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. అసలు ఇది బ్లాక్ బస్టర్ కాదని, ఫస్ట్ పార్ట్ కు ఏమాత్రం సరితూగలేదని, మ్యూజిక్ బాగా లేదని ఓ యూజర్ రివ్యూ పోస్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని, స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉందని.. సెకండాఫ్ కూడా అంతే అని మరొకరు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్, సుకుమార్ ఎఫర్ట్స్ బాగున్నాయని, ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ అస్సలు బాగా లేదని ఇంకో అభిమాని రాసుకొచ్చారు.
నార్త్ ఇండియాలో బీ గ్రేడ్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసి తీసినట్లుగా ఉందని ఓ ఫ్యాన్ కాస్త ఘాటుగానే స్పందించారు. బాగుంది కానీ మరీ అంత బ్లాక్‌బస్టరేమీ కాదని కూడా కొందరు రివ్యూలు ఇచ్చారు. అయితే నెగటివ్ రివ్యూల్లోనూ బన్నీ నటనకు మాత్రం పాజిటివ్ గానే స్పందించారు.