Pushpa 2 Advance Bookings: పుష్పరాజ్ దెబ్బకు అన్ని రికార్డులు బ్రేక్.. కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలు వెనక్కి..
03 December 2024, 11:14 IST
Pushpa 2 Advance Bookings: పుష్పరాజ్ దెబ్బకు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలాంటి సినిమాల రికార్డులను అల్లు అర్జున్ మూవీ బ్రేక్ చేయడం విశేషం.
పుష్పరాజ్ దెబ్బకు అన్ని రికార్డులు బ్రేక్.. కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలు వెనక్కి..
Pushpa 2 Advance Bookings: పుష్ప 2 మూవీ మేనియా ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ మరో రెండు రోజుల్లో అంటే గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండటంతో అల్లు అర్జున్ అభిమానుల హడావిడి మామూలుగా లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే ఈ పుష్ప 2 మూవీ కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీ సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.
పుష్ప 2.. ఫాస్టెస్ట్ మిలియన్ మార్క్
పుష్ప 2 మూవీ ఇప్పుడు బుక్ మై షో (BookMyShow)లో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత తొలి రోజు కోసమే 3 లక్షల టికెట్లు ఈ బుక్ మై షో ద్వారా అమ్ముడవడం విశేషం. ఈ విషయాన్ని ఆ పోర్టల్ సీఓఓనే వెల్లడించారు.
"పుష్ప 2: ది రూల్ ఇప్పుడు బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన సినిమా. ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ, బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణెలాంటి నగరాలు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ అమ్మకాల్లో టాప్ లో ఉన్నాయి" అని బుక్ మై షో సీఓఓ ఆశిష్ సక్సేనా వెల్లడించారు.
పుష్ప 2 టికెట్ల ధర
పుష్ప 2 టికెట్ల ధరలను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం (డిసెంబర్ 2) టికెట్ల ధర పెంపు కోసం ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచారు.
పుష్ప2 రిలీజ్ రోజైన డిసెంబర్ 5న ఆరు షోలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. 5వ తేదీన సింగిల్ స్క్రీన్‌లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200.. జీఎస్టీ ఛార్జీలతో కలిపి పెంచారు. ఇక డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చారు.
పుష్ప-2 సినిమా టికెట్ ధరలు భారీగా పెంపునకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా పుష్ప2 ది రూల్ విడుదల కానుంది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. బెనిఫిట్ షోల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లో టికెట్ రేటుపై అదనంగా రూ.800 పెంపు ఖరారు చేసింది.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. సోమవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ తోపాటు టీమ్ మొత్తం వచ్చింది. ఇప్పటికే తెలుసు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో పుష్ప 2ను పోల్చాడు అల్లు అర్జున్.
ఈ సినిమా కోసం తాము తమ ప్రాణం పెట్టామని అతడు అనడం విశేషం. అటు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా పుష్ప 2 మూవీని ఆకాశానికెత్తాడు. ఇందులో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయిందని అతడు చెప్పుకొచ్చాడు. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.