Popcorn in Theatres: ఇక థియేటర్లలో పాప్‌కార్న్ చూసి భయపడకండి.. ధరలు దిగొస్తాయ్
12 July 2023, 11:25 IST
- Popcorn in Theatres: ఇక థియేటర్లలో పాప్‌కార్న్ చూసి భయపడాల్సిన పని లేదు. హాయిగా పాప్‌కార్న్ తింటూ సినిమా చూసేయొచ్చు. ఎందుకంటే వీటి ధరలు దిగి రానున్నాయ్.
ఇక థియేటర్లలో సినిమా చూస్తే హాయిగా పాప్‌కార్న్ ఎంజాయ్ చేయండి
Popcorn in Theatres: ఈ మధ్య కాలంలో థియేటర్లకు వెళ్లాలంటే సినిమా టికెట్ల కంటే ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే పాప్‌కార్న్ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ ధరలు ప్రేక్షకులను బాదేస్తున్నాయి. అయితే ఇక నుంచి ఆ భయం అవసరం లేదు. థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు తగ్గనున్నాయి.
తాజాగా మంగళవారం (జులై 11) సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. థియేటర్లలో ఆహార పదార్థాలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ భారీ తగ్గింపుతో పాప్‌కార్న్ తోపాటు థియేటర్లలో అమ్మే వివిధ ఆహార పదార్థాల ధరలు దిగిరానున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో ఇక తమ థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడతాయని మల్టీప్లెక్స్ ఆపరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మల్టీప్లెక్స్‌లకు ఫుడ్డే ఆధారం
మల్టీప్లెక్స్ లు ఉన్నవి సినిమాల ఎగ్జిబిట్ చేయడానికే అయినా వాళ్ల ఆదాయంలో ఆహారానిది కూడా ప్రధాన వాటాయే. సుమారు 35 శాతం ఆదాయం ఫుడ్, బేవరేజీల నుంచే వస్తుండటం విశేషం. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా రేట్లను తగ్గించినా.. ఒక మెలిక పెట్టింది. ఒకవేళ సినిమా టికెట్లు, ఫుడ్ ను కలిపి బుక్ చేసుకుంటే మాత్రం 5 శాతానికి బదులు 18 శాతం జీఎస్టీ పడుతుంది.
అలా కాకుండా టికెట్లు వేరుగా బుక్ చేసుకొని.. థియేటర్ కు వెళ్లిన తర్వాత ఫుడ్ తీసుకుంటే మాత్రం వాటిపై 5 శాతమే జీఎస్టీ ఉంటుంది. థియేటర్లలో ఫుడ్ ను వేరుగా అమ్మితే దానిని రెస్టారెంట్ సర్వీస్ గా పరిగణించి 5 శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్ ల ఓనర్లు స్వాగతిస్తున్నారు. జీఎస్టీ వసూలుపై ఇచ్చిన స్పష్టతపై కూడా వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా తర్వాత థియేటర్లు కష్టకాలం ఎదుర్కొంటున్నాయి. ఓటీటీల వల్ల థియేటర్లకు వచ్చిన సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. దీనికితోడు థియేటర్లలో ఆహారానికే వేలు ఖర్చు పెట్టలేక చాలా మంది దూరంగా ఉంటున్నారు. దేశంలో మొత్తం 9 వేల సినిమా స్క్రీన్లు ఉన్నాయి. కరోనా తర్వాత వీటిలో కొన్ని మూత పడ్డాయి. ఇప్పుడు ఆహారంపై జీఎస్టీ తగ్గింపు వల్ల కచ్చితంగా థియేటర్లకు ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాపిక్