తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Police Case: అల్లు అర్జున్ ఆ పదం వాడినందుకు పోలీసు కేసు నమోదు... ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడి చిక్కుల్లో!

Allu Arjun Police Case: అల్లు అర్జున్ ఆ పదం వాడినందుకు పోలీసు కేసు నమోదు... ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడి చిక్కుల్లో!

Galeti Rajendra HT Telugu

01 December 2024, 20:06 IST

google News
  • Allu Arjun Fans Army: పుష్ప 2 రిలీజ్‌కి ఇక నాలుగు రోజులే సమయం ఉండగా.. ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. అయితే.. ముంబయిలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  

అల్లు అర్జున్‌పై కేసు నమోదు
అల్లు అర్జున్‌పై కేసు నమోదు

అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Pushpa 2: The Rule Release date: పుష్ప 2 రిలీజ్ ముంగిట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న విడుదలకాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇంతకీ అల్లు అర్జున్ చేసిన తప్పిదం ఏంటో తెలుసా? అభిమానుల్ని ఉద్దేశిస్తూ ‘ఆర్మీ’ అనడమే.

హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌పై ఫిర్యాదు

వాస్తవానికి గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశిస్తూ ఆర్మీ అనే పిలుస్తున్నారు. ఇటీవల ముంబయిలో ఏర్పాటు చేసిన పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్.. అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఆర్మీ అని సంబోధించాడు. అయితే.. అల్లు అర్జున్ అలా ఆర్మీ పదాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఉపయోగించడంపై శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆర్మీ పదం ఎలా వాడతారు?

గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడైన శ్రీనివాస్.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేశారు. దేశాన్ని రక్షించేవారిని ఉద్దేశిస్తూ పిలిచే ఆర్మీ అనే పదం చాలా గౌరవప్రదమైనదని.. అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఆ పదం వాడటం చట్టవిరుద్ధమని ఆ ఫిర్యాదులో శ్రీనివాస్‌ గౌడ్ పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఏమన్నారంటే.

ముంబయిలో జరిగిన పుష్ప-2 సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘నా దగ్గర ఆర్మీ ఉంది. నేను నా అభిమానులను ప్రేమిస్తాను. వారంతా నా కుటుంబ సభ్యులే. నా ఆర్మీ ఎల్లవేళలా నాకు అండగా నిలుస్తుంది. ఐ లవ్ యూ ఆల్. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ తన ఫిర్యాదులో ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పుష్ప 1తో నేషనల్ అవార్డు కొట్టిన అల్లు అర్జున్

2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీకి సీక్వెల్‌గా మూడేళ్ల తర్వాత ఈ ‘పుష్ప2: ది రూల్’ మూవీ వస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగిన పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. పుష్ఫ 1లో అల్లు అర్జున్ నటనకిగానూ జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిగా రష్మిక మందన్నా, పోలీస్ ఆఫీసర్‌గా ఫహద్ ఫాజిల్ (భన్వర్ సింగ్ షెకావత్) నటించారు. అలానే అనసూయ, సునీల్, జగపతి బాబు తదితరులు ఈ మూవీలో నటించారు.

తదుపరి వ్యాసం