OTT Kannada Action Drama: ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన హిట్ కన్నడ యాక్షన్ డ్రామా
20 September 2024, 19:27 IST
- OTT Kannada Action Drama: ఓటీటీలోకి ఏడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ డ్రామా మూవీ అడుగుపెట్టింది. థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన హిట్ కన్నడ యాక్షన్ డ్రామా
OTT Kannada Action Drama: ఓటీటీల్లో కన్నడ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. థియేటర్లలో అంతంతమాత్రంగా ఆడిన మూవీస్ కూడా ఓటీటీల్లో సక్సెస్ అవుతున్నాయంటే కారణం అదే. ఇప్పుడా ఓటీటీ ప్రేక్షకుల కోసం ఏడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ డ్రామా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
మత్స్యగంధ ఓటీటీ స్ట్రీమింగ్
తాజాగా ఓటీటీలోకి వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా పేరు మత్స్యగంధ. పృథ్వీ అంబర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. తాజాగా సినీబజార్ (Cinebazzar) ఓటీటీలో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమాను చూడాలంటే రూ.49 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
థియేటర్లలో మత్స్యగంధ రిలీజ్ అయినప్పుడు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. అయితే చూసిన ప్రేక్షకులు మాత్రం మూవీకి ఐఎండీబీలో మంచి రేటింగే ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీకి 9 రేటింగ్ ఉండటం విశేషం. సినిమాకు ఇన్నాళ్లూ ఓటీటీ డీల్ కూడా లేకపోవడంతో స్ట్రీమింగ్ ఆలస్యమైంది. మొత్తానికి ఇప్పుడు సినీబజార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
మత్స్యగంధ స్టోరీ ఏంటంటే?
మత్స్యగంధ సినిమాలో పృథ్వీ.. పరమ్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. తన కెరీర్ ను మలుపు తిప్పే పెద్ద కేసు కోసం అతడు ఎదురు చూస్తుంటాడు. అయితే కోస్తా కర్ణాటకలోని టోంకా అనే ఆ చిన్న ఊళ్లో అతనికి అలాంటి కేసులేమీ అంత సులువుగా దక్కవు. అయితే అనుకోకుండా అతనికి ఓ డ్రగ్ స్మగ్లింగ్ కేసు దొరుకుతుంది.
అసలు దీని సంగతేంటో తేల్చడానికి అతడు రంగంలోకి దిగుతాడు. అయితే రెయిడ్ చేసి అతడు పట్టుకున్న డ్రగ్స్ తర్వాత అనుకోకుండా మిస్ అవుతాయి. ఆ తర్వాత పరమ్ ఏం చేస్తాడు? ఆ డ్రగ్స్ ను మళ్లీ పట్టుకుంటాడా? ఈ కేసు అతని కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పింది అన్నది ఈ మత్స్యగంధ మూవీలో చూడొచ్చు.