OTT Kannada Action Drama: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ కన్నడ యాక్షన్ డ్రామా..
OTT Kannada Action Drama: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది కన్నడ యాక్షన్ డ్రామా మూవీ. ఓ నిజ జీవిత ఘటన, బెంగళూరులో నాన్ లోకల్స్ పై ఉన్న వ్యతిరేకత ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ ఉంది.
OTT Kannada Action Drama: ఓటీటీలోకి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కన్నడ మూవీ వచ్చింది. భాషలకు అతీతంగా సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ చిల్లీ చికెన్. ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.
చిల్లీ చికెన్ ఓటీటీ స్ట్రీమింగ్
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ చిల్లీ చికెన్. ఈ కామెడీ యాక్షన్ డ్రామా మూవీ సరదాగా సాగిపోతూనే అవసరమైనంత ఎమోషన్ తో ఆలోచింపజేస్తుంది. బెంగళూరులో జరిగిన ఓ నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.
స్థానిక కన్నడిగులు వలస వచ్చిన ఈశాన్య భారత పౌరులపై చూపే వివక్షను కూడా ఈ మూవీ ద్వారా దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూన్ 21న రిలీజ్ కాగా.. మొత్తానికి రెండు నెలల తర్వాత బుధవారం (ఆగస్ట్ 28) నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
చిల్లీ చికెన్ స్టోరీ ఏంటంటే?
చిల్లీ చికెన్.. ఇదో నార్త్ ఈస్ట్ ఇండియా డిష్. కానీ దేశవ్యాప్తంగా పాపులర్ వంటకం. ఆ డిష్ పేరునే టైటిల్ గా పెట్టి సినిమా తీయడం ఓ విశేషమైతే.. ఈ మూవీ ద్వారా దేశంలోని పట్టణ ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చి వివక్షకు గురవుతున్న ఈశాన్య భారతీయుల వ్యథలను కూడా ఈ మూవీ ద్వారా చూపించారు.
ఈ చిల్లీ చికెన్ సినిమా నూడుల్ హోమ్ అనే రెస్టారెంట్ నడిపే ఆదర్శ్ (శృంగ బీవీ) అనే యువకుడు.. అతని దగ్గర పని చేయడానికి వచ్చే నలుగురు నార్త్ ఈస్ట్ ఇండియా యువకుల చుట్టూ తిరుగుతుంది.
నూడుల్ హోమ్ రెస్టారెంట్ ను ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఆశయంతో ఆదర్శ్ పని చేస్తుంటే.. అక్కడి సమాజంలో ఓ గుర్తింపు, గౌరవం కోసం అక్కడ పని చేసే ఈశాన్య భారత వర్కర్లు ఆశ పడుతుంటారు. సరదాగా సాగిపోయే వీళ్ల జీవితంలో ఓ వర్కర్ అనూహ్య మరణం విషాదం నింపుతుంది. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయన్నదే ఈ మూవీ స్టోరీ.
చిల్లీ చికెన్‌కు పాజిటివ్ రివ్యూలు
కన్నడ మూవీ చిల్లీ చికెన్ కు మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అటు సాధారణ ప్రేక్షకులతోపాటు రివ్యూయర్లు కూడా మంచి రేటింగ్స్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉండటం విశేషం. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎలాంటి గందరగోళం లేకుండా డైరెక్టర్ సింపుల్ గా చెప్పిన తీరు బాగుంది.
ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉన్న చిల్లీ చికెన్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసేయండి. ఇదే ఓటీటీలో ఒక రోజు ముందు కన్నడ నుంచే వచ్చిన మరో థ్రిల్లర్ మూవీ 19.20.21 కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది.