NNS May 2nd Episode: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ.. చివరిసారిగా వీడ్కోలు పలికిన అరుంధతి.. ముగియనున్న పాత్ర
02 May 2024, 12:36 IST
Nindu Noorella Saavasam May 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 2వ తేది ఎపిసోడ్‌లో శోభనం గదిలో అమర్‌కు మిస్సమ్మ అరుంధతిలా కనిపించడంతో దగ్గరికి తీసుకుంటాడు. మరోవైపు చివరిగా అందరికీ వీడ్కోలు చెబుతుంది అరుంధతి ఆత్మ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 2వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS May 2nd April Episode) అమర్, మిస్సమ్మకు మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తుంది నిర్మల. అరుంధతి చీర, నగలు ధరించి హాల్లోకి వస్తుంది మిస్సమ్మ. తనకు భయంగా ఉందని, ఇలాంటివి వద్దని కరుణతో అంటుంది. పాలగ్లాసు తీసుకొచ్చి మిస్సమ్మకు ఇచ్చి గదిలోకి తీసుకెళ్లమని కరుణకు చెబుతుంది నిర్మల.
అరుంధతిలా భాగమతి
భయపడుతున్న భాగీకి ధైర్యం చెప్పి గదిలోకి పంపి డోర్ వేస్తుంది కరుణ. భయంభయంగా గదిలో అడుగుపెట్టిన మిస్సమ్మను చూడగానే అమర్‌కు అరుంధతిలా కనిపిస్తుంది. దాంతో మిస్సమ్మను దగ్గరకు తీసుకుంటాడు అమర్. వెంటనే తను అరుంధతి కాదని, మిస్సమ్మ అని తెలియడంతో కోపంతో ఊగిపోతాడు. ఎందుకు తనని మోసం చేశావని నిలదీస్తాడు.
ఈపెళ్లి తనకీ తెలియకుండా జరిగిపోయిందని, జరిగినదాన్ని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి చేసేదేం లేదంటుంది మిస్సమ్మ. మీరు నన్ను తిట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈరోజు జరిగిన దానికి నా తల పేలిపోతుంది. రేపు మీరు తిడితే పడటానికి నేను ఉండాలంటే కాసేపు పడుకోవాలి అంటూ మంచ మీద పూలన్నీ పడేసి పడుకుంటుంది. అమర్ కోపంగా సోఫాలో వెళ్లి పడుకుంటాడు. కానీ, నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటాడు.
కోపంతో ఊగిపోయిన అమర్
అది చూసిన మిస్సమ్మ మంచం మధ్యలో రెండు దిండ్లు అడ్డంగా పెట్టి ఆ సగంలో మీరు పడుకోవచ్చు. నేనేం మీలా శాడిస్ట్‌ని కాదంటుంది. కోపంతో అమర్ అలాగే సోఫాలో పడుకుంటాడు. కానీ, ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో వెళ్లి మంచంపై పడుకుంటాడు. అది చూసిన మిస్సమ్మ తనకి గురక పెట్టే అలవాటు ఉందని అమర్‌ని ఏడిపిస్తుంది.
చిత్రగుప్తుడు అరుంధతిని తనతోపాటు తీసుకెళ్లేందుకు సమయం ఆసన్నమైందని అంటాడు. చివరి సారిగా తన కుటుంబాన్ని ఒకసారి చూసుకుని వస్తానంటుంది అరుంధతి. సరేనంటాడు గుప్త. పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్లని చూసి జాగ్రత్తలు చెబుతుంది. మిస్సమ్మ మంచిదని, తన వల్లే ఈ పెళ్లి జరిగిందని చెప్పి వాళ్లకి వీడ్కోలు చెబుతుంది. అప్పుడే అంజు లేచి అమ్మా.. అని అరుస్తుంది. మిగతా పిల్లలందరూ లేచి ఏమైందని అడుగుతారు.
ఎప్పటికీ మర్చిపోలేడు
అమ్మ బాయ్ చెప్పినట్లు అనిపించిందంటుంది అంజు. కలగన్నావేమో పడుకో అని పడుకోబెడుతుంది అమ్ము. అమర్ తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది అరుంధతి. ఏదేమైనా కోడలు పిల్లని మర్చిపోలేకపోతున్నా అంటాడు శివరామ్. అమర్ కూడా అరుంధతిని ఎప్పటికీ మర్చిపోలేడని, చివరి శ్వాస వరకి తన గుండెలో అరుంధతిని మోస్తూనే ఉంటాడంటుంది నిర్మల. వాళ్ల మాటలు విని బాధపడుతుంది అరుంధతి.
తనకి కుటుంబం పంచిన ప్రేమను చివరిదాకా పొందలేకపోయానని ఏడుస్తుంది. ఒకసారి మిస్సమ్మతో కూడా మాట్లాడి వెళ్లిపోదామనుకుంటుంది. అమర్ గదిలోనుంచి మిస్సమ్మ ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ అటు ఇటు టెన్షన్‌గా తిరుగుతూ ఉంటుంది మనోహరి. మను.. ఇకనైనా మారవే, ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించు అని చెబుతుంది అరుంధతి. అప్పుడే అమర్ గది డోర్ శబ్ధం కావడంతో పరుగు పెడుతుంది మనోహరి.
కుళ్లుకుని చచ్చేలా చేస్తాను
తలుపుకి ఎదురుగా ఉన్న మనోహరిని చూసి వెంటనే రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది మిస్సమ్మ. మనోహరి ఎంత బాదినా తలుపు తీయదు మిస్సమ్మ. నువ్వు కుళ్లుకుని చచ్చేలా చేస్తాను చూడు అంటూ జుట్టు నలుపుకుని, పూలు తెంపుకుంటుంది భాగమతి. అదంతా చూసిన అరుంధతి ఏం అర్థంకాక అయోమయంగా చూస్తుంది. డోర్ తీసి ఆవలిస్తూ బయటకు వచ్చిన మిస్సమ్మ అవతారం చూసి షాకవుతుంది మనోహరి.
అరుంధతి ఆత్మ భూమిని వదిలి వెళ్లనుందా? సీరియల్‌లో ఆరు పాత్ర ముగియనుందా? అనే విషయాలు తెలియాలంటే మే 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్