Nagarjuna: నేను లేకుండా ఈవెంట్ చేద్దామనుకున్నావా.. నా సామిరంగ డైరెక్టర్‌పై నాగార్జున కామెంట్స్
26 January 2024, 10:18 IST
Nagarjuna Speech In Naa Saami Ranga Congrats Meet: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ మంచి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో నా సామిరంగ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ విజయ్ బిన్నిపై నాగార్జున కామెంట్స్ చేశారు.
నేను లేకుండా ఈవెంట్ చేద్దామనుకున్నావా.. నా సామిరంగ డైరెక్టర్‌ను ఆటాడేసుకున్న నాగార్జున
Nagarjuna Comments In Naa Saami Ranga Success Meet: కింగ్ నాగార్జున అక్కినేని లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన నా సామిరంగ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని 'సంక్రాంతి కింగ్' గా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కంగ్రాట్స్ మీట్‌ని నిర్వహించింది. కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అసోసియేషన్ తరఫున 'నా సామిరంగ' చిత్ర యూనిట్‌ని ఘనంగా సత్కరించారు.
అయితే ఈ నా సామిరంగ కంగ్రాట్స్ మీట్‌లో స్పీచ్‌కు ముందు డైరెక్టర్ విజయ్ బిన్నిని నాగార్జున సరదాగా ఆటాడుకున్నాడు. "నేను లేకుండా సక్సెస్ సెలబ్రేషన్ ఏంట్రా. ఈరోజు ఈవెంట్ అంటే నాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పాడు. అంటే నేను లేకుండానే ఈవెంట్ చేసేద్దామనుకున్నావా?" అని విజయ్‌పై సరదాగా కామెంట్స్ చేశాడు నాగార్జున. అనంతరం విజయ్ పడిన కష్టం గురించి నాగార్జున తెలిపాడు.
"మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్‌తో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కళ్లు మూసి తెరిచేలోగ చక్కగా సినిమా పూర్తి చేసేశాడు.( నవ్వుతూ) సినిమాని ఒక పాటలా చాలా అందంగా తీశాడు. కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ప్రతి షాట్‌ని మంచి ప్లాన్‌తో తీర్చిదిద్దాడు. తనకి ఏం కావాలో తెలుసు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు" అని విజయ్ బిన్నిపై ప్రశంసలు కురిపించాడు నాగార్జున.
"మా ఎడిటర్‌కి పెద్ద పని పెట్టలేదు. అలా తీయడం అంత ఈజీ కాదు. ఇలా చేయాలంటే నిర్ణయాలు చాలా క్లారిటీగా తీసుకోవాలి. నేను దాదాపు 95 పైగా చిత్రాలు చేశాను. ఇందులో ఇలాంటి చక్కటి క్లారిటీతో ఉన్న కొద్దిమందిలో విజయ్ ఒకరు. విజయ్‌కి ఆల్ ది బెస్ట్. అలాగే డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి ఆల్ ది బెస్ట్. ఈ వేడుకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు" అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
"అందరికీ నమస్కారం. విజయ్ రచ్చ గెలిచి ఇంట గెలిచాడు(నవ్వుతూ). విజయ్ నాలుగేళ్లుగా తెలుసు. కలిసిన ప్రతి సారి డైరెక్షన్ చేయాలని అనేవారు. మా అందరితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇండస్ట్రీకి ప్యాషన్‌తో వచ్చారు. దర్శకుడు కావాలనే తన కలని సక్సెస్ ఫుల్‌గా నెరవేర్చుకున్నారు. ఇక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని హీరో అల్లరి నరేష్ తెలిపారు.