Vijay Binni: దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని.. ఏకంగా నాగార్జునతో సినిమా
Vijay Binni About Nagarjuna: కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారారు విజయ్ బిన్ని. ఏకంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో నా సామిరంగ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని ఇంటర్వ్యూ విశేషాలు చూస్తే..
Vijay Binni On Naa Saami Ranga: కింగ్ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. తొలిసారి మెగాఫోన్ పట్టుకుని తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. ఏకంగా నాగార్జుననే తొలిసారిగా విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన నా సామిరంగ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విజయ్ బిన్ని తన అనుభవాలను పంచుకున్నారు.
కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు ?
"దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశాను. కొరియోగ్రాఫర్ కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్లు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను" అని విజయ్ బిన్ని తెలిపారు.
మీ తొలి సినిమానే నాగార్జున లాంటి పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం కష్టం అనిపించిందా?
ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం. ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని వోన్ చేసుకొని నా స్టైల్‌లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ ఉంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్‌గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.
మీ వర్క్ పట్ల నాగార్జున గారు ఎంత హ్యాపీగా ఉన్నారు?
నాగార్జున గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున గారు చెబితేనే బాగుంటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున గారు, నరేష్ గారు రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఇందులో చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే (నవ్వుతూ).
కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఒత్తిడి అనిపించిందా?
లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి ఉంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ ఉన్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది. సినిమాలో స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది. నా సామిరంగా టైటిల్ ఏఎన్ఆర్ గారి సినిమాలో ప్రజాధరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.
అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు. వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ ఉండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్‌ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ ఉంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? వాళ్ల మధ్య జరిగిన పరిస్థితులు ఏమిటనేది చాలా కొత్తగా ఉంటుంది.
ఆస్కార్ తర్వాత కీరవాణి చేసిన చిత్రమిది. ఆయనతో పని చేసిన అనుభవం ?
కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి. నాలుగు పాటలకు నేను కొరియోగ్రఫీ చేశాను. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.