Raj Tarun: అందుకోసమే నా పోరాటం.. అన్ని ఆధారాలు ఉన్నాయి: రాజ్ తరుణ్‌పై లావణ్య లేటెస్ట్ కామెంట్లు
13 July 2024, 17:44 IST
- Raj Tarun - Lavanya controversy: రాజ్ తరుణ్‌తో వివాదం గురించి లావణ్య మరిన్ని విషయాలు వెల్లడించారు. ప్రెస్‌మీట్ నిర్వహించి కొన్ని విషయాలు చెప్పారు. తాను ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారో వివరించే ప్రయత్నం చేశారు.
Raj Tarun: అందుకోసమే నా పోరాటం.. అన్ని ఆధారాలు ఉన్నాయి: రాజ్ తరుణ్‌పై లావణ్య లేటెస్ట్ కామెంట్లు
తెలుగు యువ హీరో రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఇది రోజురోజుకూ ముదురుతోంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఇటీవల వెల్లడించిన నటి లావణ్య.. ప్రతీ రోజూ కొత్త విషయాలను చెబుతున్నారు. తమకు ఇప్పటికే పెళ్లయిందని, ఓసారి తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడనే ఇటీవలే షాకింగ్ విషయాలను లావణ్య చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని లావణ్య ఆరోపించారు. ఈ వివాదంపై హైడ్రామా నడుస్తోంది. ఈ తరుణంలో నేడు (జూలై 13) ప్రెస్మీట్లో మరిన్ని విషయాలు వెల్లడించారు లావణ్య.
అందుకోసమే పోరాటం
రాజ్ తరుణ్‌తో ఉండాలని తాను కోరుకుంటున్నానని లావణ్య మరోసారి స్పష్టం చేశారు. అతడితో కలిసి జీవితం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. “ఈ ప్రపంచంలో నాకు అన్నింటికంటే రాజ్ (రాజ్ తరుణ్) ఎక్కువ. వస్తాడో రాడో తెలియదు. నా ప్రేమ నిజమైతే వస్తాడనే ఓ ఆశతో ఉన్నాను. అయితే ఈ క్రమంలో నాకు ఎదురవుతున్న పరిస్థితుల పట్ల చాలా బాధగా ఉంది” అని లావణ్య చెప్పారు.
మాల్వీ చెబితేనే డబ్బు ఇచ్చేవాడు
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని లావణ్య మళ్లీ చెప్పారు. తమ కుటుంబం నుంచి రాజ్ విడతల వారిగా రూ.70లక్షలు తీసుకున్నాడని చెప్పారు. ఎప్పుడైనా అవసరం వచ్చి డబ్బు అడిగితే.. మాల్వీ చెబితేనే తనకు పంపేవాడని లావణ్య వెల్లడించారు. తాను ప్రస్తుతం తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా మంది బెదిరిస్తూ టార్గెట్ చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని లావణ్య తెలిపారు. తాను చేస్తున్న ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
తన కుమార్తెకు రాజ్ తరుణ్‌తో పెళ్లి చేయాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే అతడు సాగదీస్తూ వచ్చాడని లావణ్య తండ్రి చెప్పారు. లావణ్యకు బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. మాల్వీతో పాటు అతడి సోదరుడు మయాంక్ కూడా లావణ్యను బెదిరించారని ఆమె తరఫున న్యాయవాది వెల్లడించారు. 2008లోనే రాజ్ తరుణ్, లావణ్యకు పరిచయం ఏర్పడందని, 2014లోనే పెళ్లి అయిందని కూడా ఫిర్యాదులో తెలిపినట్టు పేర్కొన్నారు.
సూసైడ్ చేసుకుంటానని..
తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ గత అర్ధరాత్రి తన న్యాయవాదికి లావణ్య మెసేజ్ చేశారు. ఈ విషయం కలకలం రేపింది. తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానని, తనకు బతకడం ఇష్టం లేదంటూ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత 112 నంబర్‌కు కాల్ చేసి కూడా ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే లావణ్య ఇంటికి వెళ్లి.. మాట్లాడారు. ఇలా అర్ధరాత్రి ఓ హైడ్రామా నడిచింది.
డబ్బు కోసమే లావణ్య ఇలా రచ్చ చేస్తున్నారని రాజ్ తరుణ్ మరోవైపు విమర్శిస్తున్నారు. తాము కొంతకాలం కలిసి ఉన్న మాట నిజమేనని, కానీ పెళ్లి చేసుకుంటానని తాను ఎప్పుడూ చెప్పలేదని వెల్లడించారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా ఆరోపించారు.
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేశారు. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాల్వీ కూడా ఫిల్మ్స్ నగర్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చారు. ఇలా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.
టాపిక్