తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohan Babu: వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: మోహన్ బాబు వార్నింగ్

Mohan Babu: వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: మోహన్ బాబు వార్నింగ్

26 February 2024, 15:07 IST

google News
    • Mohan Babu Warning: సీనియర్ హీరో మోహన్ బాబుకు కోపం వచ్చింది. తన పేరును వాడుకునే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలివే..
Mohan Babu: వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: మోహన్ బాబు వార్నింగ్
Mohan Babu: వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: మోహన్ బాబు వార్నింగ్

Mohan Babu: వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: మోహన్ బాబు వార్నింగ్

Mohan Babu: కలెక్షన్ కింగ్, సీనియర్ హీరో మోహన్ బాబు చివరగా ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా సినిమా చేశారు. 2022లో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత శాకుంతలంలో ఓ పాత్ర చేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో బ్లాక్‍బాస్టర్లు సాధించిన మోహన్ బాబు.. చాలా ఏళ్లుగా ఆ రేంజ్‍లో హిట్ కొట్టలేకపోయారు. నిర్మాతగానూ మోహన్ బాబు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమా కన్నప్పను నిర్మిస్తుండటంతో పాటు ఆ చిత్రంలో ఓ పాత్ర కూడా చేస్తున్నారు.

రాజకీయాల్లోనూ మోహన్ బాబు అడుగుపెట్టారు. 1996-97 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మోహన్ బాబు చేరారు. అయితే, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఏ పార్టీవైపు అంటూ సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 26) మోహన్ బాబు ఓ లెటర్ రిలీజ్ చేశారు. రాజకీయంగా తన పేరును వాడుకుంటే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల రాజకీయంగా తన పేరును కొందరు ఉపయోగించుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని మోహన్ బాబు.. సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు. సంబంధం లేని వారిని పార్టీల్లోకి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. “ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అనేక భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి.. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలో మనం దృష్టి పెట్టగలగాలి. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం” అని మోహన్ బాబు తన లేఖలో తెలిపారు.

తన పేరును రాజకీయాల కోసం వాడుకొని.. దీన్ని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్టు మోహన్ బాబు పేర్కొన్నారు. మొత్తంగా ఈసారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పకనే చెప్పారు. వైసీపీకి మద్దతుగా ఉన్న పోసాని కృష్ణమురళి కామెంట్లకై ఆయన స్పందించారని తెలుస్తోంది.

రాజకీయంగా..

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‍ఆర్ కాంగ్రెస్‍కు మద్దతు ఇచ్చిన మోహన్ బాబు.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. 2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కలిశారు. ఆయనను పార్టీలోకి బీజేపీ ఆహ్వానించిందని కూడా రూమర్లు వచ్చాయి. అయితే, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారని, ప్రస్తుతం రాజకీయంగా దూరంగా ఉండాలనుకున్నట్టు చెప్పారని వార్తలు వచ్చాయి.

మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు మంచు విష్ణు ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం