Mohanbabu | ఈ జన్మకు రాజకీయాలొద్దు..పొలిటికల్ రీఎంట్రీపై స్పందించిన మోహన్ బాబు-mohanbabu sensational comments on political re entry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohanbabu | ఈ జన్మకు రాజకీయాలొద్దు..పొలిటికల్ రీఎంట్రీపై స్పందించిన మోహన్ బాబు

Mohanbabu | ఈ జన్మకు రాజకీయాలొద్దు..పొలిటికల్ రీఎంట్రీపై స్పందించిన మోహన్ బాబు

Nelki Naresh HT Telugu
Feb 13, 2022 04:09 PM IST

మినిస్టర్ పేర్ని నాని తో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ స్నేహం కారణంగానే బ్రేక్ ఫాస్ట్ కోసమే మంత్రిని తమ ఇంటికి ఆహ్వానించినట్లు మోహన్ బాబు తెలిపారు. సినిమావాళ్లు జగన్ తో ఏం మాట్లాడారు, జగన్ వారితో ఏం చెప్పారన్నది మినిస్టర్ ను తాను అడగలేదని మోహన్ బాబు పేర్కొన్నారు.

<p>మంచు విష్ణు,&nbsp;మినిస్టర్ పేర్నినాని, మోహన్ బాబు</p>
మంచు విష్ణు, మినిస్టర్ పేర్నినాని, మోహన్ బాబు (Twitter)

ఇటీవల సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని వెళ్లిన సంగతి తెలిసిందే. మినిస్టర్ ను మోహన్ బాబు శాలువాతో సత్కరించిన ఫొటోను మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల నానికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్ లో మంచు విష్ణు టికెట్ల ధరల సమస్యను గురించి ప్రస్తావించడం విమర్శలకు దారితీసింది. సీఏం జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన భేటీ వివరాల్ని మోహన్ బాబుకు వివరించేందుకు పేర్ని నాని ఆయన ఇంటికి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దాంతో స్నేహితుడిగానే తాను మోహన్ బాబు ఇంటికి వెళ్లానని, ప్రభుత్వ ప్రతినిధిగా కాదని పేర్ని నాని వివరణ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై ఆదివారం మోహన్ బాబు స్పందించారు. పేర్ని నానిని బ్రేక్ ఫాస్ట్ కోసమే తమ ఇంటికి ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. సినిమావాళ్లు జగన్ తో ఏం మాట్లాడారు, జగన్ వారితో ఏం చెప్పారన్నది మినిస్టర్ ను తాను అడగలేదని మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ ‘ప్రతి పార్టీలో నాకు కావాల్సిన స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన వివాహ వేడుక కోసం పేర్ని నాని హైదరాబాద్ కు వచ్చారు. ఆ ఫంక్షన్ కు నేను వెళ్లాను. అక్కడ పేర్నినాని కనిపిస్తే మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కోసం ఆయన్ని ఆహ్వానించా. దానిని కొందరు చెత్తగా ఊహించుకున్నారు. మా ఆత్మీయ భేటీని తప్పు పట్టారు. నాకు ఎప్పటి నుంచో పేర్నినాని తెలుసు. గతంలో ఎప్పుడు కలిశామో సరదాగా మేమిద్దరం చర్చించుకున్నాం. అంతేకానీ సినిమావాళ్లు జగన్ తో ఏం మాట్లాడారు. జగన్ వారితో ఏం చెప్పారన్నది నేను ఆయన్నిఅడగలేదు.ఇంటికి వచ్చిన అతిథిని అలాంటివి ఎలా అడుగుతాను’ అని మోహన్ బాబు చెప్పారు. ఇండస్ట్రీకి పేర్నినాని చేస్తున్న సహాయానికి ధన్యవాదాలని విష్ణు ట్వీట్ చేస్తే దానిని తప్పు బట్టారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టికెట్ల రేట్ల సమస్య ను గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఆయన చెప్పారు. 

చంద్రబాబు నాకు బంధువు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి  మళ్లీ వచ్చే అవకాశముందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ‘ఈ జన్మకు రాజకీయాలొద్దు’ అంటూ మోహన్ బాబు బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘చంద్రబాబు నాకు బంధువు. అన్నయ్య ఎన్టీఆర్ తో సినిమాలు తీశా. ఆయన పార్టీ కోసం ప్రచారం చేశా. జగన్ బంధువు. చంద్రబాబుకు చేసినట్లుగా వైసీపీ కి ప్రచారం చేశా. అంతటితో నా బాధ్యత తీరిపోయింది. సినిమాలు, యూనివర్సిటీతో పాటు ఇకపై చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అని తెలిపారు.  

Whats_app_banner

సంబంధిత కథనం