Mogali Rekulu Actor Died: టాలీవుడ్‌లో విషాదం - మొగలి రేకులు సీరియల్ నటుడు కన్నుమూత
02 March 2024, 12:34 IST
Mogali Rekulu Actor Died: మొగలి రేకులు సీరియల్ ఫేమ్ పవిత్రనాథ్ అలియాస్ దయా కన్నుమూశాడు. అతడు ఎలా, ఎప్పుడు చనిపోయాడన్నది మాత్రం తెలియరాలేదు.
పవిత్రనాథ్
Mogali Rekulu Actor Died: మొగలి రేకులు సీరియల్ యాక్టర్ పవిత్ర నాథ్ కన్నుమూశాడు. మొగలి రేకులు సీరియల్‌లో దయా సాగర్ పాత్రలో పవిత్రానాథ్ కనిపించాడు. పాజిటివ్ రోల్‌లో పవిత్రనాథ్ నటనకు మంచి పేరు వచ్చింది. మొగలి రేకుల తర్వాత ఎక్కువగా సీరియల్స్ చేయలేకపోయాడు.
నిజం కాకపోతే బాగుండు...
పవిత్రనాథ్ మృతి చెందిన విషయాన్ని యాక్టర్ ఇంద్రనీల్ భార్య రామిమేఘ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పవి... నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు లేవనే వార్త నిజం కాపోతే బాగుండు. అబద్ధం కావాలని ఆశపడ్డాం. నీకు తుది వీడ్కోలు చెప్పే అవకాశం కూడా మాకు దక్కకపోవడం బాధను కలిగిస్తోంది అని రామిమేఘ పోస్ట్ చేసింది. ఆమెతో పాటు పలువురు సీరియల్ యాక్టర్స్ కూడా పవిత్రనాథ్‌కు సంతాపం ప్రకటించారు.
ఎప్పుడు...ఎలా...
పవిత్రనాథ్ ఎలా, ఎప్పుడు చనిపోయాడన్నది మాత్రం రామిమేఘ వెల్లడించలేదు. అనారోగ్య సమస్యలతోనే అతడు కన్నుమూసినట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబపరంగా, ఆర్థికంగా పవిత్రనాథ్ అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవిత్రనాథ్ తనను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులకు గురిచేసినట్లు అతడి భార్య గతంలో ఆరోపణలు చేసింది. అతడికి అనేకమందితో సంబంధాలు ఉన్నాయంటూ చెప్పింది. మొగలి రేకులు తర్వాత పవిత్రనాథ్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సీరియల్స్ చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.
ఐదేళ్ల పాటు టెలికాస్ట్...
మొగలి రేకులు సీరియల్ 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. 1368 ఎపిసోడ్స్‌తో రెండు సీజన్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఈ సీరియల్‌కు మంజుల నాయుడు దర్శకత్వం వహించింది. అప్పట్లో అత్యధిక కాలం టీవీలో టెలికాస్ట్ అయిన సీరియల్స్‌లో ఒకటిగా మొగలి రేకులు రికార్డ్ క్రియేట్ చేసింది.
సీరియల్‌లో సత్య, ధర్మ, దయ అనే ముగ్గురు అన్నదమ్ముల కథతో మంజుల నాయుడు ఈ సీరియల్‌ను తెరకెక్కించారు. ఈ సీరియల్ ద్వారా ఇంద్రనీల్, సాగర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకున్నారు.