తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli Documentary Review: బాగుంది.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ: రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ

SS Rajamouli Documentary Review: బాగుంది.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ: రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ

03 August 2024, 16:34 IST

google News
    • Modern Masters: SS Rajamouli Documentary Review: దర్శక ధీరుడు, ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ తీసుకొచ్చింది. దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందో ఇక్కడ చూడండి.
Rajamouli OTT Documentary Review: బాగుంది.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ: రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ
Rajamouli OTT Documentary Review: బాగుంది.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ: రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ

Rajamouli OTT Documentary Review: బాగుంది.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ: రాజమౌళి డాక్యుమెంటరీ రివ్యూ

డాక్యుమెంటరీ: మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి

ఓటీటీ: నెట్‍ఫ్లిక్స్, ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్

ఎడిటర్: సంయుక్త కాజా, సంగీతం: రోహిత్ కులకర్ణి

దర్శకులు: రాఘవ్ ఖన్నా, తన్వి అజింక్య

బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమాను దేశవ్యాప్తం చేశారు దర్శక ధీరుడు, గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍కు ఎదిగారు. అంతర్జాతీయంగా భారత సినీ ఇండస్ట్రీకి ఆయనే ముఖంగా ఉన్నారు. హాలీవుడ్‍లోనూ రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్.. రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని తీసుకొస్తోందనగానే చాలా హైప్ క్రియేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి ఇది ఎలా ఉందంటే..

ఇంటర్వ్యూలతో..

ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమ చోప్రా చేసిన ఇంటర్వ్యూలతో ఈ డాక్యుమెంటరీ సాగింది. రాజమౌళితో పాటు వారి ఎంఎం కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, రమా రాజమౌళి, కార్తికేయ, కరణ్ జోహార్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‍చరణ్, దగ్గుబాటి రానా సహా మరికొందరి ఇంటర్వ్యూలు ఉన్నాయి. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రూసో కనిపించారు. రాజమౌళి గురించి మాట్లాడారు.

ఈ డాక్యుమెంటరీలో తన గురించి రాజమౌళి కొన్ని విషయాలు చెప్పారు. తనకు సినిమాలపై ఆసక్తి ఎలా పెరిగిందో, సినీ ఇండస్ట్రీలోనే మొదటి నుంచి ఉన్న తమ కుటుంబ పరిస్థితులు వివరించారు. మొదటి నుంచి ఇప్పటి వరకు తన సినీ ప్రయాణం, విజయాలు, ఆందోళన చెందిన సందర్భాలు వివరించారు. అంశాలపై తన అభిప్రాయాలను చెప్పారు. ఆయన సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారి కుటుంబం గురించి వివరించారు. రమా రాజమౌళి ఇలా మరికొందరు వారి విషయాలు చెప్పారు. రాజమౌళితో కలిసి పని చేసిన అనుభవాలను హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‍చరణ్, రానా చెప్పారు.

కంటెంట్ ఎక్కువగానే..

రాజమౌళి డాక్యుమెంటరీలో కంటెంట్ ఎక్కువగానే ఉంది. రాజమౌళి బాల్యం గురించిన అంశాలు కూడా ఉన్నాయి. ఆయన జీవితంలోని ముఖ్యమైన దశల గురించిన వివరాలను మేకర్స్ చూపించారు. సినిమాల విషయంలో ఆయన ఎంత ప్యాషన్‍గా ఉంటారో, అనుకున్నది తెరకెక్కించేందుకు ఎంత కఠినంగా ఉంటారో, ఎంత అంకితభావంతో ముందుకు వెళతారో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ సమయంలో రాజమౌళి, వారి కుటుంబం, నిర్మాత శోభూ యార్లగడ్డ ఎంత టెన్షన్ పడ్డారో అనే విషయం ఆకట్టుకునేలా ఈ డాక్యుమెంటరీలో ఉంది. గ్లోబల్ ఆర్ఆర్ఆర్ సక్సెస్‍ గురించి కూడా ఉంది. జేమ్స్ కామెరూన్, రూసో కూడా రాజమౌళిని ప్రశంసించారు. బాహుబలి నాటి విషయాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పంచుకున్నారు.

ఈ మూడు అంశాలపై..

తెలిసిన విషయాలే: దర్శక ధీరుడు రాజమౌళి గురించి తెలుగు వారిలో అధిక శాతం మంది చాలా విషయాలు తెలుసు. ఈ డాక్యుమెంటరీలోనూ ఎక్కువగా అవే ఉన్నాయి. ఎవరికీ తెలియని, ఎగ్జైట్ అయ్యే కొత్త అంశాలు పెద్దగా లేవు. నార్త్, అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ డాక్యుమెంటరీ ద్వారా రాజమౌళి గురించి కొత్త అంశాలు తెలుస్తాయో. అయితే, తెలుగు వారికి ఎక్కువగా తెలిసిన విషయాలే ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి. రామాయణంలో రాముడి కంటే తనకు రావణాసురుడి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తుందని రాజమౌళి చెప్పే అంశం ఒక్కటే కాస్త కొందరికి కొత్తగా అనిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని గతంలోనే ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు.

ఎడిటింగ్: ఈ డాక్యుమెంటరీలో ఎడిటింగ్ నిరాశపరుస్తుంది. ఫ్లాట్‍గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో అంత ఇంట్రెస్టింగ్‍గా సాగదు. ఏదో వరుసగా ఇంటర్వ్యూలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కంటెంట్ చాలా ఉన్నా దాన్ని ఆసక్తికర రీతిలో మేకర్స్ చూపించలేకపోయారు. ఎడిటింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్ కట్స్ కూడా పెద్దగా లేవు.

తెలుగు డబ్బింగ్: రాజమౌళి డాక్యుమెంటరీ చూసే తెలుగు వారికి డబ్బింగ్ పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుపమ చోప్రా, జేమ్స్ కామెరూన్, రూసో, కరణ్ జోహార్ మినహా దాదాపు అందరూ తెలుగు వచ్చిన వారే. రాజమౌళి, కీరవాణి, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‍చరణ్, రానా వాయిస్‍లు తెలుగు వారికి బాగా తెలుసు. అయితే, ఈ డాక్యుమెంటరీలో వారికి వేరే వాళ్లతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం అంతగా బాలేదు. తెలుగులో వారితోనే స్వయంగా చెప్పించాల్సింది. కనీసం రాజమౌళితో అయినా తెలుగులో మాట్లాడించి ఉంటే బాగుండేది.

మొత్తంగా..

భారతీయ ఇండస్ట్రీని.. ముఖ్యంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్ ఎస్ఎస్ రాజమౌళిపై వచ్చిన ఈ డాక్యుమెంటరీ సిరీస్‍ను ఓసారి కచ్చితంగా చూడొచ్చు. నిడివి సుమారు గంట 15 నిమిషాలే ఉంది. ఈ డాక్యుమెంటరీ అంచనాలు పెట్టుకున్నట్టు ఎగ్జైట్ చేయకపోయినా.. బోరింగ్‍గా అనిపించదు. తెలుగులో డబ్బింగ్‍కు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీని చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం