Manjummel Boys Climax: మంజుమ్మల్ బాయ్స్ క్లైమ్యాక్స్‌లో ఓరియో బిస్కెట్లు వాడారట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
23 May 2024, 21:57 IST
- Manjummel Boys Climax: మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ క్లైమ్యాక్స్ సీన్ లో ఓరియో బిస్కెట్లు వాడారని మీకు తెలుసా? అది కూడా మేకప్ కోసం అంటే నమ్మగలరా? డైరెక్టర్ చిదంబరం ఏం చెబుతున్నాడో చూడండి.
మంజుమ్మల్ బాయ్స్ క్లైమ్యాక్స్‌లో ఓరియో బిస్కెట్లు వాడారట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Manjummel Boys Climax: మంజుమ్మల్ బాయ్స్ మలయాళం ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మూవీ క్లైమ్యాక్స్ లో సుభాష్ పాత్ర పోషించిన శ్రీనాథ్ భాసి మేకప్ కోసం ఓరియో బిస్కెట్లు వాడారట.
మంజుమ్మల్ బాయ్స్ క్లైమ్యాక్స్ ట్విస్ట్
తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ లో ఓ కేరళ యువకుడు పడిపోవడం అనే నిజజీవిత ఘటన ఆధారంగా ఈ మంజుమ్మల్ బాయ్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. 2006లో ఈ ఘటన జరిగింది. ఇందులో ఆ గుహలో పడిపోయిన సుభాష్ అనే పాత్రలో నటుడు శ్రీనాథ్ భాసి కనిపించాడు. అతన్ని మూవీ క్లైమ్యాక్స్ లో నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు.
అయితే ఇంతటి గాయాలు అయినట్లుగా చూపించడానికి మేకర్స్ వాడింది ఏంటో తెలుసా? ఓరియా బిస్కెట్లు అట. ఈ విషయాన్ని డైరెక్టర్ చిదంబరమే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంత లోతైన గుహలో పడి ప్రాణాలు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఈ సుభాషే. మరి అలాంటి పాత్ర తీవ్ర గాయాలతో ఉన్నట్లుగా చూపించడానికి తాము ఈ మేకప్ ట్రిక్ పాటించినట్లు చిదంబరం చెప్పాడు.
అది ఓరియో బిస్కెట్ల మేకప్
ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీమ్ సాయంతో శ్రీనాథ్ భాసికి మేకప్ వేశారట. "భాసికి వేసిన మేకప్ ప్రోస్తెటిక్స్ కాదు. అవి ఓరియో బిస్కెట్లు. అది మేకప్ టెక్నిక్. అలాంటి గాయాలు, ఆ మురికిని చూపించడానికి ఇలాంటి చిన్న ట్రిక్స్ మేము ఉపయోగించాం. ఈ క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్ కు వెళ్తుంది. అతడు చాలా సీనియర్ మేకప్ ఆర్టిస్ట్. సౌబిన్ షాహిర్ కూడా అది చూసి షాక్ తిన్నాడు"అని చిదంబరం చెప్పాడు.
అయితే ఈ బిస్కెట్ల మేకప్ వల్ల ఈ మలయాళ నటుడు శ్రీనాథ్ భాసి చాలానే కష్టాలు పడ్డాడు. ఆ క్రీమ్ వాసనకు అతన్ని చీమలు చుట్టుముట్టాయి. అతని ఒళ్లంతా చీమలు కరవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా ఆ సీన్ మాత్రం శ్రీనాథ్ పర్ఫెక్ట్ గా చేశాడు. ఈ మూవీలో అతని నటనకు అందరూ ఫిదా అయ్యారు.
మంజుమ్మల్ బాయ్స్‌కు ఇళయరాజా నోటీసులు
మంజుమ్మల్ బాయ్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో గుణ మూవీలోని కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను అక్కడక్కడా వాడారు. తన అనుమతి లేకుండా మంజుమ్మల్ బాయ్స్‌లో కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను ఉపయోగించుకున్నందుకు మూవీ టీమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నోటీసులు పంపించారు.
కమ్మని నీ ప్రేమ లేఖలే పాటపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, తన పర్మిషన్ తీసుకోకుండా మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ సినిమాలో పాటను వాడుకున్నదని ఇళయరాజా ఈ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.