Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు - నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్‌కు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. మంజుమ్మల్ బాయ్స్‌లో తన అనుమతి లేకుండా కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను ఉపయోగించారని, ఆ పాటను సినిమాలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Manjummel Boys: మలయాళం మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. స్టార్స్ ఎవరు లేకుండా కొత్త నటీనటులతో కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 242 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే 200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన తొలి మూవీగా నిలిచింది. అంతే కాకుండా మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి అగ్ర హీరోల సినిమాలను అధిగమిస్తూ మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా అరుదైన రికార్డు నెలకొల్పింది.
తెలుగులో పది కోట్ల కలెక్షన్స్...
తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ మంజుమ్మల్ బాయ్స్‌ను రిలీజ్ చేసింది. తెలుగు వెర్షన్ పది కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. కోటి రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా పదింతల లాభాల్ని మిగిల్చింది.
లీగల్ నోటీసులు...
మంజుమ్మల్ బాయ్స్ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా మేకర్స్‌కు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. కమల్‌హాసన్ గుణ మూవీని రిఫరెన్స్‌గా తీసుకొని దర్శకుడు చిదంబరం మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెరకెక్కించాడు.
గుణ సినిమాలో చూపించిన ఓ గుహ చుట్టూ మంజుమ్మల్ బాయ్స్ కథ సాగుతుంది. గుణ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కమ్మని నీ ప్రేమ లేఖలే అనే పాటను మంజుమ్మల్ బాయ్స్ లో ఉపయోగించారు. టైటిల్ కార్డ్స్‌తో పాటు మరో ఒకటి రెండు సందర్భాల్లో ఈ పాట సినిమాలో కనిపిస్తుంది. ఈ పాట బీజీఎమ్ కూడా సినిమాలో వినిపిస్తుంది.
ఇళయరాజా అనుమతి లేకుండా...
తన అనుమతి లేకుండా మంజుమ్మల్ బాయ్స్‌లో కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను ఉపయోగించుకున్నందుకు మూవీ టీమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నోటీసులు పంపించారు. కమ్మని నీ ప్రేమ లేఖలే పాటపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, తన పర్మిషన్ తీసుకోకుండా మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ సినిమాలో పాటను వాడుకున్నదని ఇళయరాజా ఈ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడానికి తన పాటను ప్రమోషనల్ కంటెంట్‌గా వాడుకున్నారని ఇళయరాజా పేర్కొన్నాడు.
పాటను తొలగించాలి...
మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో పాటు ఇతర ప్రమోషనల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను తొలగించాలని ఇళయరాజా డిమాండ్ చేశాడు. తన అనుమతి తీసుకోకుండా పాటను సినిమాలో ఉపయోగించినందుకుగాను పదిహేను రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని ఈ నోటీసులలో ఇళయరాజా పేర్కొన్నట్లు సమాచారం.
లేని పక్షంలో మూవీ టీమ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ఇళయరాజా మంజుమ్మల్ బాయ్స్ టీమ్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నోటీసుల వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మంజుమ్మల్ బాయ్స్‌తో పాటు పలు మూవీ టీమ్‌లకు, దర్శకనిర్మాతలకు ఇళయరాజా నోటీసులు పంపించారు.
షౌబీన్ షాహిర్ ప్రొడ్యూసర్...
మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో షౌబీన్ షాహిర్, శ్రీనాత్ భాసీ, బాలు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. షౌబీన్ షాహిర్ ఈ మూవీకి ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు.