Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్
17 December 2024, 8:09 IST
- Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా? మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 16) ఆళ్లగడ్డకు వెళ్లిన మనోజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తలపై స్పందించాడు.
మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్
Manchu Manoj: మంచు ఫ్యామిలీ గొడవలు టాలీవుడ్ లో ఎంత సంచలనం రేపాయో తెలుసు కదా. మంచు మనోజ్ ఓవైపు.. మోహన్ బాబు, విష్ణు మరోవైపు.. వీళ్ల గొడవలు రక్తి కట్టించాయి. ఈ నేపథ్యంలో మనోజ్ జనసేనలో చేరబోతున్నాడన్న వార్తలు మరింత ఆసక్తి రేపాయి. అయితే వీటిపై తాజాగా అతడు స్పందించాడు. ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ.. నో కామెంట్స్ అని అతడు అనడం గమనార్హం.
జనసేనలోకి మనోజ్?
ఈ ఏడాది టాలీవుడ్ ను కుదిపేసిన వివాదాల్లో మంచు ఫ్యామిలీ వివాదం కూడా ఒకటి. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవ, అతని ఇంట్లో జరిగిన డ్రామా.. మీడియాపై దాడి, అరెస్టు హెచ్చరికలు, క్షమాపణలతో ఈ తతంగమంతా రక్తికట్టించింది. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 16) తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా తన భార్య మౌనిక, కూతురు దేవసేనతో కలిసి ఆళ్లగడ్డ వెళ్లాడు మంచు మనోజ్. అంతకుముందే అతడు జనసేనలోకి వెళ్తున్నాడన్న వార్తలు రావడంతో మీడియా కూడా అతన్ని అదే ప్రశ్న అడిగింది.
మీరు జనసేనలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు.. దానిపై ఏం చెబుతారు అని అడగగా.. దానిపై నో కామెంట్స్ అంటూ మనోజ్ నవ్వుతూ వెళ్లిపోయాడు. ఆళ్లగడ్డకు తన కూతురితో కలిసి తొలిసారి వచ్చానని, తన అత్త శోభ జయంతికి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నట్లు కూడా మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. తన కోసం ఆళ్లగడ్డకు తరలివచ్చిన అందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు.
మనోజ్ రాజకీయాల్లోకి వస్తాడా?
మంచు ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బలపడాలని మంచు మనోజ్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నంద్యాల నుంచే అతడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడని, దీనికోసం జనసేనలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి, శోభ మృతిచెందిన తర్వాత.. భూమా అఖిలప్రియ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నేపథ్యంలో అక్క బాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అతడు దీనిపై నో కామెంట్స్ అని అంటున్నాడు. కానీ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.