Premalu Actress: ఆ డైరెక్టర్ నన్ను కొట్టాడు.. అందుకే ఆ సినిమా వదిలేశాను: ప్రేమలు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
28 February 2024, 16:13 IST
- Premalu Actress: ఈ మధ్యే ప్రేమలు మూవీతో పాపులర్ అయిన మలయాళ నటి మమితా బైజు డైరెక్టర్ బాలా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను సెట్స్ లో కొట్టేవాడని ఆరోపించింది.
ప్రేమలు మూవీ హీరోయిన్ మమితా బైజు డైరెక్టర్ బాలా తనను కొట్టాడని ఆరోపించింది
Premalu Actress: మలయాళ నటి మమితా బైజు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను సూర్య రాబోయే మూవీ వనంగాన్ నుంచి తప్పుకోవడానికి కారణమేంటో వెల్లడించింది. ఈ సినిమా డైరెక్టర్ బాలా తనను తిట్టేవాడని, సెట్స్ లో చేయి కూడా చేసుకున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. ఇది తెలిసి కూడా సూర్య ఏమీ అనలేదని కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
ప్రేమలు నటి మమితా ఇంటర్వ్యూ
బాలా డైరెక్షన్లో సూర్య నటిస్తున్న మూవీ వనంగాన్. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ అవకాశం మమితా బైజుకి దక్కింది. ఈ మధ్యే మలయాళంలో వచ్చిన ప్రేమలు మూవీతో ఈమె పాపులర్ అయింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి మమితా తప్పుకుంది. దీనికి కారణమేంటో తెలియలేదు. తాజాగా ఇంటర్వ్యూలో మమితానే తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది.
సెట్స్ లో డైరెక్టర్ బాలా తనపై చేయి చేసుకున్నాడని చెప్పింది. "అందులో విల్లాదిచంపాటు అనే ఓ వాయిద్యం ఉంది. అది చూసి నేను ఆ పాత్ర చాలా కాలంగా దానిని వాయిస్తోందా లేక అదే తొలిసారా అని అడిగాను. నా పాత్రకు అందులో చాలా అనుభవం ఉందని చెప్పారు. అలా అయితే నేను దానిని సరిగ్గా వాయించాలి కదా? ఆ డ్రమ్ వాయిస్తూ పాట కూడా పాడాల్సి ఉంటుంది.
అది కూడా ఒక రకమైన స్టైల్లో. అప్పుడు దానిని వాయించే ఓ మహిళను బాలా నాకు చూపించాడు. అది చూసి నేర్చుకోమన్నాడు. ఆ వెంటనే షూటింగ్ చేయాలన్నాడు. అసలు నాకేమీ అర్థం కాలేదు. నేను మూడుసార్లు ట్రై చేస్తే కానీ అది రాలేదు. ఆ లోపు నన్ను అతడు చాలాసార్లు తిట్టాడు. కొట్టాడు కూడా. తనతో పని ఇలాగే ఉంటుందని మొదట్లోనే అతడు నాకు చెప్పాడు.
నేను అందుకు తగినట్లే సిద్ధమయ్యాను. సూర్య సర్ ఉన్నా ఏమీ అనలేదు. అతనికి బాలాతో ఎలా ఉంటుందో ముందే తెలుసు. అంతకుముందు వాళ్లు కలిసి పని చేశారు. నేనే దీనికి కొత్త" అని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మమితా బైజు వెల్లడించింది.
డైరెక్టర్ బాలాపై ఆరోపణలు
డైరెక్టర్ బాలా ప్రవర్తన కారణంగానే చివరికి ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో రోషినీ ప్రకాష్ ను తీసుకున్నారు. నిజానికి డైరెక్టర్ బాలాపై ఇలాంటి ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. బాలాతో కలిసి పితామగన్ సినిమాలో చేసిన చియాన్ విక్రమ్, పరదేశీలో చేసిన అథర్వలాంటి నటులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అజిత్ కూడా దీని కారణంగానే నాన్ కడావుల్ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇంతకుముందు మరో తమిళ డైరెక్టర్ మారి సెల్వరాజ్ పైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అతడు కూడా సెట్స్ లో నటులను కొట్టాడన్న విమర్శలు ఉన్నాయి. ఇక మమితా బైజు విషయానికి వస్తే ఈ మధ్యే ప్రేమలు అనే సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది.